శతమానం భవతి టైపులోనే తేజు వేరే దారిలో…


శతమానం భవతి టైపులోనే తేజు వేరే దారిలో...
శతమానం భవతి టైపులోనే తేజు వేరే దారిలో…

నిన్న విడుదలైన ప్రతిరోజూ పండగే ట్రైలర్ చూసిన ఎవరికైనా కలిగే మొదటి ఫీలింగ్.. ఈ సినిమా పాయింట్ ఏంటి శతమానం భవతికి ఇంత పోలి ఉంది అని. దాదాపు అదే పాయింట్ తో మారుతి ప్రతిరోజూ పండగే కథ చెప్పడానికి ప్రయత్నించాడు. తన కొడుకులు, కూతుళ్లు అందరూ తనను వదిలేసి విదేశాల్లో సెటిల్ అయిపోతే తన భార్యకు విడాకులు ఇస్తున్నా అని పిల్లలకు అబద్ధం చెప్పి తన దగ్గరకి రప్పించుకునే కథ శతమానం భవతి. ఇక తన చావు మరో ఐదు వారాల్లో ఉందని తెలుసుకుని పిల్లలని తన దగ్గరకి రప్పించుకుని కథ ప్రతిరోజూ పండగే. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారు అదే ఫీలింగ్ తో ఉంటారు కాబట్టి ముందే మారుతి తెలివిగా ఆ పాయింట్ ను కూడా ట్రైలర్ లో పెట్టేసాడు.

ట్రైలర్ చివర్లో సత్యరాజ్ కొడుకైన రావు రమేష్, శతమానం భవతి సినిమా టైపులో ఎక్కడ ప్రకాష్ రాజ్ అబద్ధం చెప్పగానే ఏమి అడక్కుండా ఎగురుకుంటూ వచ్చేసే పిల్లల టైపులో మేము కూడా నీ అబద్ధాన్ని నమ్మి వచ్చేయలేదు కదా అంటూ తమ సినిమా మీద తనే సెటైర్ వేసేశాడు. ఇక ట్రైలర్ చూసిన ఎవరికైనా కలిగే మొదటి ఫీలింగ్.. ఈ సినిమా పండక్కి వచ్చి ఉండాల్సింది అని. మరి డిసెంబర్ 20న విడుదల చేసుకునే బదులు మరో 20 రోజులు ఆగి ఉంటే ఎంచక్కా పండక్కి విడుదల చేసుకునే వారు కదా. ఎందుకని సంక్రాంతికి పోటీ పడలేదు అన్నది అర్ధం కాలేదు.

చావును కూడా నవ్వుతూ సాగనంపాలనే మెయిన్ థీమ్ తో ప్రతిరోజూ పండగే తెరకెక్కింది. చావుకు దగ్గర పడ్డ తాతయ్య.. తాత చేయలేకపోయి మిగిలిపోయిన వాటిని పూర్తి చేయిపించే మనవడు.. ఆ మనవడికి ఒక క్యూట్ లవ్ స్టోరీ… అసలు తన తండ్రి త్వరలోనే మరణిస్తాడా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉండే కొడుకు.. ఇలా కథను బానే సెట్ చేసాడు మారుతి. చూస్తుంటే మంచి ఫన్ ఎంటర్టైనర్ లా ఉంది. కచ్చితంగా క్లైమాక్స్ లో తాత చావు గురించి ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. మారుతి మళ్ళీ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు తరహాలో కామెడీని సిద్ధం చేసాడనిపిస్తోంది. మొత్తంగా తేజ్ కి మరో హిట్ సిద్ధమైనట్లేనన్న సంకేతాలు ట్రైలర్ చూస్తే కలుగుతాయి.