
డిజిటల్ రంగం యమ స్పీడుగా దక్షిణాదిని ఆవహిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిలో పాగా వేసిన డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ చిన్ని చిన్నగా దక్షిణాదిని ఆక్రమించడం మొదలుపెట్టాయి. అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే సినిమాలని కొంటూ కొత్త తరహా కంటెంట్‌కు తెరలేపింది. నెట్ ఫ్లిక్స్ కూడా దక్షిణాదిపై గురిపెట్టింది. బాలీవుడ్లో ఇప్పటికే ప్రముఖ క్రేజీ స్టార్స్‌తో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ వరుసగా మార్కెట్లోకి వదులుతున్న నెట్ ఫ్లిక్స్ కన్ను తాజాగా సౌత్ మార్కెట్‌పై పడింది.
తెలుగులో ఇప్పటికే `లస్ట్ స్టోరీస్`తో మేకింగ్ మొదలుపెట్టిన నెట్ ఫ్లిక్స్ తమిళ రంగంపై కూడా కన్నేసింది. సినిమాల్లో క్రేజీ తారలుగా ఓ వెలుడు వెలుగుతున్న వారికి భారీ ఆఫర్లు ఎర వేస్తూ డిజిటల్ రంగంలోకి ఆహ్వానిస్తోంది. ఈ జాబితాలోకి ఇప్పటికే ఈషారెబ్బా, మంచు లక్ష్మి, నిహారిక కొణిదెల, జగపతిబాబు, బిందు మాధవి, నవదీప్ వంటి తారలు చేరిపోగా ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి భానుమతిగా ఆకట్టుకున్న సాయిపల్లవి చేరబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ధనుష్ హీరోగా క్యాస్టిజమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం `అసురన్`. ఈ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్న వెట్రిమారన్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. దీని ద్వారా సాయి పల్లవి తొలిసారి డిజిటల్ వరల్డ్‌లోకి ఎంటర్ కాబోతోందని తెలిసింది. కథ, వెట్రిమారన్ టేకింగ్ నచ్చడం వల్లే సాయి పల్లవి ఈ వెబ్ వరలల్డ్ లోకి ప్రవేశిస్తోందని తమిళ చిత్ర వర్గాలు అంటున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తోంది.