స‌మంత మాయ‌కు 10 ఏళ్లు!


స‌మంత మాయ‌కు 10 ఏళ్లు!
స‌మంత మాయ‌కు 10 ఏళ్లు!

స‌మంత తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న మాయ‌లో ప‌డేసి అప్పుడే ప‌దేళ్లు పూర్త‌య్యాయి. ఆమె న‌టించిన తొలి చిత్రం `ఏమాయ చేసావె`. 2010లో వ‌చ్చిన ఈ చిత్రం స‌రిగ్గా ఇదే రోజు ఫిబ్ర‌వ‌రి 26న‌ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. జెస్సీగా ఆక‌ట్టుకుని తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. అక్క‌డి నుంచే త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించి ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి దాదాపు 40 చిత్రాల్ని పూర్తి చేసింది.

ఈ ప‌దేళ్ల ప్ర‌యాణంలో ఫ్లాపుల కంటే విజ‌యాల్నే అత్య‌ధికంగా సొంతం చేసుకుని కొంత మంది హీరోల‌కి ల‌క్కీ ఛార్మ్‌గా మారింది. ప‌దేళ్ల క్రితం `ఏమాయ చేసావే` చిత్రంతో టాలీవుడ్‌లో త‌ప‌దైన మెస్మ‌రిజంతో మ్యాజిక్‌ని మొద‌లుపెట్టిన స‌మంత ఇక్క‌డే అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో ల‌వ్‌లో ప‌డింది. ఏడేళ్ల ప్రేమాయ‌ణం త‌రువాత ఇరు కుటుంబాల అంగీకారంతో సామ్‌, చై వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. `అఆ` నుంచి న‌ట‌న‌కు ఆస్కార‌మున్న చిత్రాల్ని మాత్ర‌మే అంగీక‌రిస్తూ త‌న కెరీర్‌ని కొత్త మ‌లుపులు తిప్పుకుంది.

ఆ త‌రువాత చేసిన `రంగ‌స్థ‌లం`, మ‌హాన‌టి, యుట‌ర్న్‌, సూప‌ర్‌డీల‌క్స్‌, చైతో క‌లిసి న‌టించిన మ‌జిలీ, కొత్త త‌ర‌హా క‌థ‌తో చేసిన `ఓ బేబీ` చిత్రాలు స‌మంత‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టాయి. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లోనే కాదు న‌ట‌న‌కు ఆస్కారమున్న పాత్ర‌ల్లోనూ త‌ను రాణించ‌గ‌ల‌న‌ని, బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లని కురిపించ‌గ‌ల‌న‌ని, క్రౌడ్ పుల్ల‌ర్‌గా నిల‌వ‌గ‌ల‌న‌ని నిరూపించుకుంది. సామ్ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి ప‌దేశ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా త‌న‌ని అభినందిస్తూ ర‌కుల్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో ఆక‌ట్టుకుంటోంది.