ప్లాప్ హీరోయిన్ అంటే అమ్మడికి మండిపోయింది


ప్లాప్ హీరోయిన్ అంటే అమ్మడికి మండిపోయింది
ప్లాప్ హీరోయిన్ అంటే అమ్మడికి మండిపోయింది

సమంత.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పదేళ్ల క్రితం ఏ మాయ చేసావే సినిమాతో అందరినీ మాయ చేసేసిన సామ్ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ముందంతా కమర్షియల్ సినిమాల్లో మెరిసిన ఈ భామ పెళ్ళైన తర్వాత తన నిర్ణయాల్లో మార్పును తీసుకొచ్చింది. కేవలం హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు, సోలో హీరోయిన్ సినిమాలు చేస్తోంది. లాస్ట్ ఇయర్ ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ ఏడాది 96 రీమేక్ జానులో నటించినా ప్రశంసలు దక్కాయి కానీ ఫలితం దక్కలేదు. జాను డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కొంతమంది సమంతను ప్లాప్ హీరోయిన్ అనడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే నడిచింది. ప్రతీ ప్లాప్ కు హీరోయిన్ ను బాధ్యురాలిని చేయడం భావ్యం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఇటీవలే మీడియాతో ముచ్చటించిన సమంత కూడా ఈ విషయంపై స్పందించింది. ఒక హీరో వరసగా మూడు ప్లాపులు అందుకున్నా సరే నాలుగో సినిమా చూడటానికి జనాలు సిద్ధంగా ఉంటారు. అదే హీరోయిన్ ఒక్క ప్లాప్ ఇచ్చినా ఆమెది ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు అని వాపోయింది. హీరో తెర మీద నడుచుకుంటూ వస్తుంటే చాలు అభిమానులు ఖుషీ అయిపోతారు. అదే ఒక హీరోయిన్ ఎంత కష్టపడ్డా వారికి తగిన గుర్తింపు మాత్రం ఉండదు. హీరో, హీరోయిన్ ఒక సినిమా కోసం సమానంగా కష్టపడుతున్నా సరే హీరో పారితోషకాలతో పోలిస్తే హీరోయిన్ వి చాలా తక్కువగా ఉంటాయి. అదెందుకో నాకు అసలు అర్ధం కాదు. అలాగే ప్రతీ ప్లాప్ కు హీరోయిన్ ను బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. హీరోయిన్ ఒక్కసారి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే వరసగా అలాంటి సినిమాల్లో చూడలేరు. అదే హీరో ఎన్ని మాస్ సినిమాలు చేసినా ఆదరిస్తారు అంటూ చాలా కాలంగా సినిమాల్లో నాటుకుపోయిన భావాల్ని పంచుకుంది సమంత. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.