అసలు జానును పొగిడేసిన సమంత


Samantha praises Trisha performance in 96
Samantha praises Trisha performance in 96

గత కొన్నేళ్లుగా సమంత సినిమాల ఎంపికలో కచ్చితమైన తేడాను చూపిస్తోంది. తన మనసుకు నచ్చిన కథలను మాత్రమే చేస్తోంది. ఫక్తు కమర్షియల్ బొమ్మల జోలికి అసలు వెళ్లట్లేదు. అందుకనే గతేడాది ఆమె నుండి ఓ బేబీ వంటి భిన్నమైన చిత్రమొచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనను ఎంత పొగిడినా తక్కువే. ఈ ఏడాది జాను చిత్రంతో మన ముందుకు వస్తోంది సమంత. ప్రతీ ఏడాది మనసుకు దగ్గరైన స్పెషల్ చిత్రాలు ఇస్తున్నందుకు దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకుంది సమంత. ఈ సినిమాతో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఆమె తెలిపింది.

ఇక జాను సినిమా ఒరిజినల్ వెర్షన్ 96 సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సమంత త్రిషను తెగ పొగిడేసింది. ఆమె చాలా అద్భుతంగా నటించిందని, అందరూ 96 అనగానే విజయ్ సేతుపతి గురించి మాట్లాడతారు కానీ నా వరకూ త్రిష పెర్ఫార్మన్స్ ఇంకా బాగా నచ్చింది. ఆమె పాత్రలో జీవించేసింది అని పొగడ్తలతో ముంచేసింది.

ఒరిజినల్ లో త్రిష బాగా చేసిందా లేక మీరు బాగా చేసారా ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఎవరు బాగా చేసారు అన్నది ముఖ్యం కాదు. త్రిషను కాపీ కొట్టకుండా చేసానా లేదా అన్నదే ముఖ్యం. ఒకర్ని కాపీ కొట్టి నటించాలంటే ఆ సినిమా పండదు. నేను 96 చిత్రాన్ని ఒకసారి మాత్రమే చూసాను. ఆ తర్వాత మళ్ళీ చూడాలనుకోలేదు. కథను ఫీల్ అయ్యి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయాను. దర్శకుడు ప్రేమ్ కుమార్ కూడా నా పెర్ఫార్మన్స్, త్రిష పెర్ఫార్మన్స్ రెండూ భిన్నంగా ఉన్నాయి అని అన్నారు. రేపు సినిమా చూసాక కూడా ప్రేక్షకులు అదే ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది.

రేపు జాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని టీమ్ అంతా ధీమాగా ఉంది. గోవింద్ వసంత అందించిన పాటలు ఇప్పటికే పెద్ద సక్సెస్ అయిన విషయం తెల్సిందే. మరి 96 సినిమాను తలపించే విధంగా జాను ఉంటుందో లేదో తెలియాలంటే మరొక్క రోజు వేచి చూడక తప్పదు.