సమంత భారీ అవకాశాన్ని వదులుకుందా?


Samantha rejects oh baby Bollywood remake offer
Samantha rejects oh baby Bollywood remake offer

పెళ్ళైన తర్వాత సమంత సినిమాల సెలక్షన్ లో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు కమర్షియల్ సినిమాలకు ఎస్ చెప్పే సమంత ఇప్పుడు తన పాత్ర బాగుంటే తప్ప, సినిమాలో ఏదొక విశేషముంటే తప్ప ఒప్పుకోవట్లేదు. పెళ్ళైన తర్వాత రంగస్థలం, మహానటి, సూపర్ డీలక్స్, యూ టర్న్, ఓ బేబీ అంటూ తన పాత్రకు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే చేసుకుంటూ వచ్చింది. చేసిన దానికి తగ్గట్లే ప్రతీ పాత్రకు ఆమెకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా యూ టర్న్, ఓ బేబీ, సూపర్ డీలక్స్ వంటి సినిమాలతో సమంత నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంది. రీసెంట్ గా శర్వానంద్ తో కలిసి 96‘ రీమేక్ లో నటించింది సమంత. ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయినా కూడా మంచి రిలీజ్ కోసం వెయిట్ చేసి ఇంకా విడుదల చేయలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది.

96’ సినిమా పూర్తి చేసి నెలన్నర రోజులు అయినా కానీ సమంత మరే సినిమా ఇంత వరకూ సైన్ చేయలేదు. తనవరకూ చాలానే కథలు వచ్చినా ఇంకా దేనికీ ఎస్ చెప్పలేదు. అసలు సినిమాలు ఓకే చేసే మూడ్ లోనే లేదు. ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. ఇది కాకుండా ఏ భాషలో కూడా సినిమాలు ఒప్పుకోలేదు. దీంతో సమంత తల్లి కాబోతోంది అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే వాటిలో నిజం లేదని తెలియజేసింది సమంత. తన దగ్గరకు మంచి పాత్రలు వస్తే కచ్చితంగా ఓకే చేస్తానని చెబుతోంది.

ఇదిలా ఉంటే సమంతకు ఒక గోల్డెన్ ఆఫర్ వస్తే చేయనని చెప్పేసిందిట. అది కూడా సౌత్ నుండి కాదు, బాలీవుడ్ నుండి. అవును, ఇప్పటిదాకా ఒక్క హిందీ సినిమా కూడా చేయని సమంత, ఇప్పుడు అక్కడినుండి ఆఫర్ వస్తే కాదనుకుంది. దానికి కారణం అది ఓ బేబీకు రీమేక్ కావడమే. అసలు ఓ బేబీనే ఒక రీమేక్. మళ్ళీ దానికి రీమేక్ అంటే తనకు ఎగ్జైట్మెంట్ ఉండదన్నది సమంత భావన. చేసిన పాత్రనే మళ్ళీ ఏం చేస్తామని చెప్పి సమంత నో చెప్పిందట. దాంతో ఈ పాత్రను తాప్సికు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా తాప్సి కూడా తన సినిమాల సెలక్షన్ తో మెప్పిస్తోంది. మరి ఈ చిత్రాన్ని తాప్సి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.