మెగా ప‌వ‌ర్‌స్టార్ కోసం రామ‌ల‌క్ష్మీ?


Samantha to romance again Ram Charan
Samantha to romance again Ram Charan

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, స‌మంత తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `రంగ‌స్థ‌లం`. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ప‌క్కాగా స్కెచ్ గీసి మ‌రీ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో మ‌ర‌పురాని చిత్రంగా నిల‌చింది. `మ‌హాన‌టి` పోటీలో లేకుంటే చిట్టిబాబు పాత్రకు ప‌లు అవార్డులు ద‌క్కేవే. అంత‌గా చిట్టిబాబు పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించారు రామ్‌చ‌ర‌ణ్‌. పెళ్లి త‌రువాత స‌మంత చేసిన ఈ సినిమా ఆమెలో మ‌రింత న‌మ్మ‌కాన్ని పెంచేసింది.

త్వ‌ర‌లో ఈ హిట్ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ కాబోతోంది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ `ఆర్ ఆర్ ఆర్‌`లో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ప్రిరిలీజ్ బిజినెస్ విష‌యంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇదిలా వుంటే  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి ఈ చిత్రాన్ని హీరో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. సినిమాలో ఆయ‌న ఓ కీల‌క అతిథి పాత్ర‌లోనూ న‌టిస్తున్న‌ట్టు తెలిసింది.

న‌క్స‌లిజం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌భావ‌వంతంగా ద‌ర్శ‌కుడు మ‌లుస్తున్నార‌ట‌. సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ నాయ‌కుడిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. సినిమాలో ఈ పాత్ర‌కూ ఓ ల‌వ్‌స్టోరీ వుంటుంద‌ని, అత‌నికి జోడీగా స‌మంత‌ని చిత్ర బృందం ఇప్ప‌టికే సంప్ర‌దించార‌ని, పాత్ర న‌చ్చ‌డంతో సామ్ ఓకే చెప్పేసింద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని చిత్ర వ‌ర్గాలు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌నున్నార‌ని వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ శివారులోని కోకా పేట్‌లో జ‌రుగుతోంది.