టాలీవుడ్ కమెడియన్లతో ప్లాప్ హీరో సినిమా


Sandeep Kishan producing a film with Tollywood Comedians
Sandeep Kishan producing a film with Tollywood Comedians

యంగ్ హీరో సందీప్ కిషన్ ను అందరూ ప్లాప్ హీరో అని సంభోదిస్తున్నారిప్పుడు. దానికి మన యంగ్ హీరో కూడా ఏం ఫీలవ్వట్లేదని తన లేటెస్ట్ సినిమా తెనాలి రామకృష్ణతో మంచి హిట్ కొడతానని, అప్పుడు తన పేరు మారిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సందీప్ కిషన్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. దీంతో తన మార్కెట్ కూడా పూర్తిగా దెబ్బతింది. రీసెంట్ సినిమా నిను వీడని నీడను నేనే తనను ప్లాపుల నుండి అయితే బయటపడేయగలిగింది కానీ దాన్ని హిట్ కేటగిరీలో వేయాలం. అందుకే తెనాలి రామకృష్ణ హిట్ అవ్వడం సందీప్ కు చాలా ముఖ్యం. ఈ సినిమాను కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించాడు. అయితే ఈయన కూడా అసలు ఫామ్ లో లేడు. అసలు ఈ పేరుతో ఒక దర్శకుడు ఉన్నాడని జనాలకు గుర్తుచేయాల్సిన పరిస్థితి. హీరోయిన్ హన్సిక గురించి చెప్పేదేముంది. తెలుగులో ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు తమిళంలో కూడా అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ తెనాలి రామకృష్ణ చిత్రం హిట్ అవ్వడం అత్యవసరం. నవంబర్ 15న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి బజ్ అయితే బానే ఉంది. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది. మరి సినిమా ఏమవుతుందో చూడాలి.

సందీప్ కిషన్ ఈ సినిమాను బానే ఓన్ చేసుకున్నాడు. ప్రమోషన్స్ విషయంలో గట్టిగానే ఉన్నాడు. ఇక నిన్ననే హీరోయిన్ హన్సికతో కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ షో నిర్వహించాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నిను వీడని నీడను నేనే చిత్రంతో నిర్మాతగా మారిన సందీప్ కిషన్ ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను లీడ్ గా పెట్టి ఒక సినిమాను నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది. కామెడీ చిత్రాలకి ఆదరణ బాగుండడంతో సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు తెలియజేస్తానంటున్నాడు. మరి నిర్మాతగా రెండో ప్రయత్నంలో సందీప్ విజయం సాధిస్తాడా లేదా అన్నది చూడాలి.

ఇక సందీప్ కిషన్ ప్రస్థానం చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెల్సిందే. అవార్డు విన్నింగ్ చిత్రంగా ప్రస్థానం బోలెడన్ని ప్రశంసల్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ లకు ఈ చిత్రం ద్వారా మంచి పేరొచ్చింది.

అయితే ఇదే ప్రస్థానంను అదే పేరుతో ఒరిజినల్ ను తెరకెక్కించిన దేవా కట్టా దర్శకుడిగా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తే అది దారుణమైనఫలితాన్ని అందుకుంది. ఎందుకిలా అయింది అని సందీప్ ను ఒకరు ప్రశ్నించగా.. అప్పట్లో ప్రస్థానం కొత్త కథ. అందుకే అందరూ ఆదరించారు. ఇన్నేళ్ల తర్వాత బాలీవుడ్ లో తీశారు. ఈలోపు ఇలాంటి కథలు బాలీవుడ్ లో చాలా వచ్చేసి ఉంటాయి కదా. అందుకే జనాలు కూడా ఓల్డ్ గా ఫీలైనట్టున్నారు. అందుకే ఆడలేదు అని కుండబద్దలు కొట్టేసాడు సందీప్ కిషన్.