సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు.. పీక్స్ లో హంగామా


Sankranthi releases hungama in january first week
Sankranthi releases hungama in january first week

సంక్రాంతి వస్తోందంటే టాలీవుడ్ కు కొత్త కళ రావడం పక్కా. ఈసారి కూడా అందుకు మినహాయింపేమి కాదు. సంక్రాంతికి ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయ్. అందులో 2 సినిమాలపై వందల కోట్లలో బిజినెస్ నడుస్తోంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలకు కలిపి దాదాపు 250 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక రజినీకాంత్ నటించిన దర్బార్ ఉండనే ఉంది. ప్రస్తుతం రజిని అంత ఫామ్ లో లేకపోయినా కచ్చితంగా తనని తక్కువ అంచనా వేయలేం. దర్బార్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే తెలుగు చిత్రాలకు కచ్చితంగా ఇబ్బందే అవుతుంది. ఈ మూడు సినిమాలకు తోడు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నాడు. సంక్రాంతికి వచ్చే చిన్న సినిమాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సంక్రాంతికి వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర వాళ్ళది.

ఇలా వరసగా విడుదలలు ఉండడంతో చిత్ర ప్రచార జోరు కూడా మాములుగా లేదు. ఇప్పటికే ఈ నాలుగు చిత్రాల నుండి ప్రోమోలు, పాటలు అంటూ వివిధ రకాల ప్రమోషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే జనవరి మొదటివారం నుండి ఇవి నెక్స్ట్ లెవెల్ కు చేరుకోనున్నాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల హంగామా ఈ వారంలో ఉండనుంది. జనవరి 3న దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హంగామా షురూ అవుతుంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక జరగనుంది. జనవరి 5న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ ను ప్లాన్ చేసారు. దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా రానుండడం స్పెషల్ అట్రాక్షన్. ఎల్బీ గ్రౌండ్స్ లో ఈ వేడుక భారీ ఎత్తున జరగనుంది. ఇక జనవరి 6న అల వైకుంఠపురములో ఈవెంట్ ఉండనుందని సమాచారమందింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక జనవరి 8న ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి తారక్ ముఖ్య అతిధిగా రానుండడంతో ఆసక్తి రెట్టింపైంది. ఇలా వరస ఈవెంట్లు, ఆ తర్వాత సినిమా వేడుకలతో జనవరి మొదటి రెండు వారాలు సినీ ప్రియులకు పండగే.