సంక్రాంతి సినిమాల గొడవ మళ్ళీ మొదటికి వచ్చిందా?


sankranthi war between ala vaikunthapuramulo and sarileru neekevvaru
sankranthi war between ala vaikunthapuramulo and sarileru neekevvaru

సాధారణంగా టాలీవుడ్ సినిమాలంటే అటు ఇండస్ట్రీ వాళ్ళూ, ఇటు సాధారణ ప్రేక్షకులూ బోలెడంత ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. సంక్రాంతి సీజన్ లో ఎక్కువగా భారీ సినిమాలు విడుదలవుతుంటాయి. చిన్న సినిమాలు విడుదలైనా వాటికి భారీ ప్రొడక్షన్ హౌస్ ల బ్యాకింగ్ ఉండాలి. లేదంటే ఆ సీజన్ లో పెద్ద సినిమాల మధ్య వచ్చి క్రష్ అయిపోయే ప్రమాదముంది. ఉదాహరణకు శతమానం భవతి పెద్ద సినిమాల వల్ల రిలీజైనా పండక్కి పెద్ద విజయం సాధించడం వెనకాల దిల్ రాజు కృషి ఎంతో ఉంది. ఇక ఈసారి సంక్రాంతి కూడా రంజుగా ఉండే అవకాశముంది.

ముందు నుండీ సంక్రాంతి సినిమాల విషయంలో ఈసారి రగడ జరుగుతోంది. మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురములో చిత్రాలు ఒకేరోజు విడుదల తేదీలను ప్రకటించాయి. అలా జరిగి కొన్ని వారాలు అయినా కూడా ఇంకా ఆ చిత్రాల రిలీజ్ డేట్స్ గురించి చర్చిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రేడ్ ఈ రెండు చిత్రాలు తమ రిలీజ్ డేట్లను ఒకేరోజు అనౌన్స్ చేయడం వల్ల చాలా కంగారు పడింది. ఇలా అయితే బయ్యర్లందరూ దారుణంగా నష్టపోతారని భయపడింది. రెండు చిత్రాలూ కూడా వెనక్కి తగ్గడానికి ఇష్టపడకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది.

అయితే సమయానికి తెలుగు నిర్మాతల గిల్డ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దినట్లు ప్రకటించింది. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల కాబోతోందని, అల వైకుంఠపురములో ముందు నుండీ అనుకుంటున్నట్లు జనవరి 12న విడుదల అవుతుందని వారు ప్రకటించారు. దీని ప్రకారంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు. అయితే అప్పటినుండి సరిలేరు నీకెవ్వరు చిత్రానికి రిలీజ్ డేట్ వేయడం ఆపేసారు. జనవరి 11 అని కానీ జనవరి 12 అని కానీ వేసింది లేదు. అల వైకుంఠపురములో మాత్రం ఎప్పటిలానే జనవరి 12న విడుదల అవుతుందని ప్రకటించింది.

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాల మధ్యా రాజీ కుదిర్చినట్లు వచ్చినా అలాంటిదేం జరగలేదని, సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు ఈ విషయంలో పూర్తి నెగటివ్ గా ఉన్నారట. ఎలా అయినా జనవరి 12న తమ సినిమాను విడుదల చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారట. అందుకే ఇప్పటినుండే గోల ఎందుకని రిలీజ్ డేట్ అని వేయకుండా సంక్రాంతి రిలీజ్ అని వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే సంక్రాంతి విషయంలో రగడ మళ్ళీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది.

సంక్రాంతికి ఇంకా రజినీకాంత్ నటించిన దర్బార్, నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఎంత మంచివాడవురా సినిమాలు కూడా విడుదలవుతున్నా ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు సినిమాల మధ్యే ఉంది.