మహేష్ – బన్నీ గిల్లుడు ఆగలేదుగా!


Sarileru Neekevvaru and Ala Vaikunthapuramulo fighting it out at promotions
Sarileru Neekevvaru and Ala Vaikunthapuramulo fighting it out at promotions

ఏ ముహూర్తాన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు సంక్రాంతికి రావడానికి డిసైడ్ అయ్యాయో కానీ ఈ రెండు సినిమాలు ప్రతి విషయంలో పోటీ పడుతూ అభిమానులను కంగారు పెడుతున్నాయి. ఇదంతా మొదట రిలీజ్ డేట్ వ్యవహారంతో మొదలైన విషయం తెల్సిందే. మొదట అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ ను జనవరి 12 అని ప్రకటించారు. అది అయిన కొద్ది సేపటికే మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు అదే రోజున విడుదలవుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఒకేరోజు ఇలా రెండు భారీ సినిమాలు వస్తే ఎలా అని ట్రేడ్ కంగారు పడిపోతే, నిర్మాతల గిల్డ్ రంగంలోకి దిగి ఇద్దరు నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చినట్లు ప్రెస్ నోట్ సైతం విడుదల చేసింది. దీని ప్రకారం సరిలేరు నీకెవ్వరు ఒక రోజు ముందుగా.. అంటే జనవరి 11న విడుదలవుతుందని ప్రకటించారు. అయితే అప్పటినుండి సరిలేరు టీమ్ ఎక్కడా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

ఈ విషయం పక్కనపెడితే ప్రమోషన్స్ లో కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడుతూ ఒకదాన్ని మరొకటి దెబ్బకొట్టేలా ప్రయత్నిస్తున్నాయి. మొదట అల వైకుంఠపురములో టీమ్ తమ సినెమాలోనుండి మూడో పాట విడుదలవుతున్నట్లు ఒక తేదీ ప్రకటిస్తే, సరిలేరు నీకెవ్వరు టీమ్ అదే రోజున సాయంత్రం 5:04 నిమిషాలకు తమ సినిమా టీజర్ వస్తోందని ప్రకటించింది. ఇక అల వైకుంఠపురములో టీమ్ కూడా తక్కువ తినకుండా సరిగ్గా అదే టైమ్ కు, అంటే సాయంత్రం 5:04 నిమిషాలకు తమ సాంగ్ వస్తుందని తెలిపింది. అయితే అనుకోకుండా సాంగ్ రిలీజ్ ఆలస్యమైంది. అదే వేరే విషయం. కాకపోతే ఇద్దరూ ఒక రోజు ప్రమోషనల్ యాక్టివిటీస్ ను ప్లాన్ చేయడం వల్ల రెండూ కూడా భారీగా ట్రెండ్ కాకుండా ఆగిపోతున్నాయి.

ఈ గొడవ ఇంకా మైండ్ బ్లాక్ సాంగ్ కు కూడా కొనసాగింది. సరిలేరు నీకెవ్వరు టీమ్ తమ సినిమా నుండి మొదటి సాంగ్ మైండ్ బ్లాక్ ను గత సోమవారం విడుదల చేయగా, సరిగ్గా అదే రోజున అవసరం లేకపోయినా కానీ అల వైకుంఠపురములో టీమ్ సామజవరగమన సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించాయి కాబట్టి ఫ్యాన్స్ వెర్షన్ ను విడుదల చేసింది. దీంతో సరిలేరు మొదటి సాంగ్ అనుకున్నంతగా ట్రెండ్ అవ్వలేకపోయింది. ఇక ఈరోజు సరిలేరు టీమ్ నుండి రెండో సాంగ్ సూర్యుడివో చంద్రుడివో సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదలవుతుండగా అవసరం లేకపోయినా కానీ అల వైకుంఠపురములో టీమ్ టీజర్ గ్లిమ్ప్స్ ను 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేసింది. ఈ చిత్ర టీజర్ డిసెంబర్ 11న విడుదలవుతుండగా రెండు రోజుల ముందుగా ఇలా గ్లిమ్ప్స్ ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీనివల్ల సరిలేరు ప్రమోషన్స్ కు ఎంతో కొంత గండి పడటం ఖాయం. ఇలా ప్రతిసారీ ఒకరి ప్రమోషన్స్ కు ఒకరు అడ్డు తగులుతూ రెండు సినిమాలూ కూడా అంతో ఇంతో చెడు చేసుకుంటున్నాయి. మరి ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ఎంత దూరం వెళుతుందో చూడాలి.