సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ విషయంలో అంత వీకా?!


Sarileru Neekevvaru promotions is very weak
Sarileru Neekevvaru promotions is very weak

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదల కావడానికి ముస్తాబవుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కేరళ అందాల నడుమ సాగుతోంది. అయితే రిలీజ్ కు ఇంకా రెండు నెలలే సమయం ఉన్నా ప్రమోషన్స్ ఇంతవరకూ ఊపందుకోలేదు. మరోవైపు మహేష్ చిత్రానికి పోటీగా వస్తోన్న అల వైకుంఠపురములో మాత్రం ప్రమోషన్స్ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం లోని రెండు పాటలు విడుదలవ్వగా రెండూ కూడా సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ రెండు పాటలు కలిపి 130 మిలియన్ వ్యూస్ కు పైనే రావడంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ నెల 22న మూడో పాట కూడా విడుదల కానుంది.

అల వైకుంఠపురములో చిత్రంతో పోల్చుకుంటే సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ విషయంలో బాగా వీక్ గా ఉన్న విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రమోషన్స్ లేవని విమర్శలు ఎక్కువవ్వడంతో దీపావళికి ఒక వీడియో కూడా విడుదల చేసారు. సినిమా వచ్చేది సంక్రాంతికి ఇప్పటినుండి దేనికి హడావిడి అంటూ అల వైకుంఠపురములో టీమ్ పైనే పంచ్ లు వేసే ప్రయత్నం చేసారు. అది ఆ సమయం వరకూ బాగానే అనిపించినా రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. అల వైకుంఠపురములో చిత్రానికి బజ్ ఓ రేంజ్ లో ఏర్పడింది. దానికి తగ్గట్లుగానే అన్ని ఏరియాల్లో బిజినెస్ అవుతోంది. ఈ విషయాల్లో సరిలేరు నీకెవ్వరు టీమ్ బాగా వెనుకబడి ఉందని చెప్పాలి.

అయితే సోషల్ మీడియాలో రెస్పాన్స్ లు చూసిన తర్వాత ఆలస్యంగానైనా సరిలేరు టీమ్ మేల్కొంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సినిమాను ప్రమోట్ చేయడానికి వినూత్నమైన ఆలోచనలతో ముందుకొచ్చే యువతీ యువకులు కావాలీ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటన జారీ చేసింది. అంటే దీనర్ధం ఇప్పటిదాకా ప్రమోట్ చేయడానికి అసలు టీమ్ అంటూ ఏం లేదనా? లేక ఉన్న టీమ్ నచ్చక కొత్త టీమ్ కోసం చూస్తున్నారా?? ఏదేమైనా ఇప్పటికైనా సరిలేరు ప్రమోషన్స్ షురూ చేస్తే బెటర్.