రావిపూడి పంచ్ లో పస లేదా? – ఎవరూ పట్టించుకోవట్లేదేంటి?

Anil Ravipudi
Anil Ravipudi

గత నెల రోజులుగా సంక్రాంతి సినిమాల గురించి ఒకటే చర్చ. అందులోనూ సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఒకేరోజు విడుదలవుతుండడం పట్ల అందరూ పలు రకాలుగా మాట్లాడేసుకున్నారు. ఎంత కాదనుకున్నా ఒకేరోజు విడుదలయ్యే సినిమాలపై పోలికలు వస్తాయి. ఏది బెటర్ అనే డిబేట్ లు జరుగుతాయి. కాకపోతే ఈసారి సంక్రాంతి సినిమాల గురించి చర్చ చాలా త్వరగా మొదలైపోయింది. పైగా అల వైకుంఠపురములో టీమ్ ప్రమోషన్స్ ను కూడా చాలా త్వరగా మొదలుపెట్టేసింది. సినిమా విడుదలకు ఇంకా 100 రోజులున్నా కూడా తొలి పాట సామజవరగమన ను విడుదల చేసి హంగామా మొదలుపెట్టింది.

ఈ పాట సృష్టిస్తోన్న సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇటీవలే కాలంలో విడుదలైన బెస్ట్ మెలోడీ అని విమర్శకులు సైతం కొనియాడారు. మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్ గా అప్పుడే ఈ పాట రికార్డులకెక్కింది. ఈ పాటతో అల వైకుంఠపురములో మీద అంచనాలు ఆకాశాన్నంటే రేంజ్ కు చేరుకున్నాయి.

తొలి పాట సంగతే ఇలా ఉంటే రీసెంట్ గా దీపావళికి అల వైకుంఠపురములో నుండి సెకండ్ సాంగ్ కూడా విడుదలైంది. రాములో రాముల అనే పేరుతో విడుదలైన సెకండ్ సాంగ్ మొదటి పాట కంటే ఎక్కువ వైరల్ గా మారింది. విడుదలైన ఫస్ట్ 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ సౌత్ ఇండియన్ సాంగ్ గా ఇది నిలిచింది. ఇలా విడుదలైన రెండు పాటలూ కూడా అద్భుతంగా వర్కౌట్ అవ్వడంతో అల వైకుంఠపురములో టీమ్ ఆనందానికి అవధుల్లేవు. ఏ టార్గెట్ తో అయితే ఇలా రెండు పాటలను చాలా ముందుగా విడుదల చేసారో దానికన్నా మించిన రిజల్ట్ రావడం నిజంగా వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే జోష్ లో వారు మిగిలిన షూట్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

ఒకవైపు అల వైకుంఠపురములో టీమ్ అంత హడావిడి చేస్తుంటే సరిలేరు నీకెవ్వరు మాత్రం గప్ చుప్ గా ఏ హడావిడి చేయకుండా ఉండడం ఏంటో మహేష్ ఫ్యాన్స్ కు అర్ధం కాలేదు. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఇలా చేస్తే ఏదొక ప్రమోషనల్ మెటీరియల్ వదులుతాడని ఆశ పడ్డారు. కానీ అనిల్ రావిపూడి తన స్టైల్లో ఒక సెటైరికల్ వీడియో చేసి వదిలాడు. ఎప్పుడో సంక్రాంతి రిలీజ్ కు ఇప్పటినుండి హడావిడి ఏంటి అంటూ సుబ్బరాజు, వెన్నెల కిషోర్ లను పెట్టి ఒక చిన్న వీడియో బైట్ నిర్మాణ సంస్థ యూట్యూబ్ ఛానెల్ లో వదిలాడు.

అయితే దీనికి రెస్పాన్స్ అంతంత మాత్రంగా వస్తుండడం మహేష్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అల వైకుంఠపురములో టీమ్ మీద సెటైర్ గా ఈ వీడియోను భావించిన వారు ఇప్పుడు దానికి లక్ష వ్యూస్ మాత్రమే రావడంతో కంగారు పడుతున్నారు. అల వైకుంఠపురములో కంటే సరిలేరు నీకెవ్వరు ఎక్కడ వెనకబడిపోతుందో అని వారి ఆందోళన. అందులో కూడా అర్థముంది బాస్. కానీ విషయమేమిటంటే సరిలేరు నీకెవ్వరు టీమ్ దాన్ని ఏదో సరదాకి తీశారు కానీ సీరియస్ గా తీసుకుని ప్రమోట్ చేయలేదు. అందుకే తక్కువ వ్యూస్.