పంచ్ లతో పిచ్చెక్కించనున్న మహేష్


sarileru neekevvaru teaser filled with punches
sarileru neekevvaru teaser filled with punches

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు, ప్రేక్షకులలో రోజురోజుకీ అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటిదాకా ప్రమోషన్స్ మొదలవ్వలేదు అనే కంప్లైంట్ ఉన్నా రేపు టీజర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సరిలేరు నీకేవ్వరుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా పండగ చేసుకుంటున్నారు. అది నేషనల్ వైడ్ ట్రెండ్ అయితే కానీ వదలట్లేదు. దీంతో రేపు విడుదల కానున్న టీజర్ ఎలా ఉండబోతోందో, ఎన్ని రికార్డులు సృష్టించనుందో అన్న అంచనాలు మొదలయ్యాయి.

ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ టీజర్ విడుదలైతే ఏ విధంగా రికార్డులు బద్దలుకొట్టాలా అని ప్లాన్స్ వేస్తున్నారు. లైక్స్, వ్యూస్ ఇలా ఏ విషయంలోనూ తగ్గకూడదని నిర్ణయించుకుని దానికి తగ ప్రణాళికలు వేసుకుంటున్నారు. సాధారణంగా స్టార్ హీరో సినిమా టీజర్ అంటే హీరో నడిచి వచ్చే షాట్ లేక బైక్ మీద వచ్చే షాట్ పెట్టి ఆఖర్లో ఒక పంచ్ డైలాగ్ వదులుతారు. దీనికే ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతారు. అయితే సరిలేరు నీకెవ్వరు విషయంలో దీనికి భిన్నంగా జరగబోతోందని టాక్.

ఈ టీజర్ చాలా స్పెషల్ గా ఉండాలని నిర్ణయించాడట దర్శకుడు అనిల్ రావిపూడి. 100 శాతం సక్సెస్ ఉన్న ఈ దర్శకుడు సినిమాలకు పంచ్ డైలాగులు రాయడంలో దిట్ట. అందుకే స్టార్ హీరోతో మొదటి సారి పనిచేస్తున్న అనిల్ రావిపూడి ఈ టీజర్ ను చాలా స్పెషల్ గా కట్ చేయించాడట. వరసగా పంచ్ డైలాగులతో ఉక్కిరిబిక్కిరి చేసేలా టీజర్ ను రూపొందించాడట. ఆఖర్లో బ్యాంగ్ కింద విజయశాంతిని మహేష్ ఎదుర్కొనే చిన్న బిట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ బాబు కొచ్చిన్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అక్కడినుండే టీజర్ కు డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ తో సరిలేరు టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా, హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. సినిమాపై ఇప్పటికే తారా స్థాయిలో ఉన్న అంచనాలు ఈ టీజర్ తో మరో లెవెల్ కు వెళ్తాయని నమ్మకంగా ఉన్నాడు అనిల్ రావిపూడి. ఈ మధ్య కాలంలో మహేష్ ఎక్కువగా కామెడీ చేయలేదు. మాస్ సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. అనిల్ రావిపూడి ఈ రెండు విషయాల్లో చాలా కేర్ తీసుకున్నాడట. మాస్ అంశాలను సినిమాలో చక్కగా పొందుపరిచినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ చిత్ర టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తయితే షూటింగ్ మొత్తం అయిపోయినట్లే. రష్మిక మందన్న తొలిసారి సూపర్ స్టార్ మహేష్ తో ఈ సినిమాలో జట్టుకడుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.