సరిలేరు నీకెవ్వరు టీజర్ రివ్యూ: సంక్రాంతి మొగుడు వచ్చేస్తున్నాడు


Sarileru Neekevvaru teaser review
Sarileru Neekevvaru teaser review

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు టీజర్ భారీ అంచనాల మధ్య కొద్దిసేపటి క్రితం విడుదలైంది. టీజర్ గురించి ఊదరగొట్టేసిన ప్రొడక్షన్ టీమ్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేసింది. అందుకే విడుదలైన 9 నిమిషాల్లోనే రియల్ టైమ్ లో 1 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది సరిలేరు నీకెవ్వరు టీజర్. ప్రమోషన్స్ లేవు, లేవు అని గోల పెడుతున్న ఫ్యాన్స్ కు ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. టీజర్ అంటే ఊరికే నడిచేయడమో, బండి మీద వచ్చేయడమో కాకుండా మహేష్ ఫ్యాన్స్ కు మాసి మహేష్ ను పరిచయం చేసాడు. ఈ మధ్య అన్నీ సటిల్ యాక్టింగ్ ఉన్న సినిమాలే ఎంచుకుంటూ వచ్చిన మహేష్, సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మాసిగా అదరగొట్టేసాడని టీజర్ చూస్తేనే అర్ధమవుతోంది. పంచ్ డైలాగులతో, ఫైట్లతో టీజర్ ను నింపేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రం నుండి ఫ్యాన్స్ ఏమేం అంశాలు ఆశించవచ్చో చూపించాడు.

టీజర్ మొదలవ్వడమే ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే డైలాగ్ తో ఉంటుంది. ఎండ, చలి, వర్షం ఇవేం లెక్కచేయకుండా మీ కోసం మేము కష్టపడుతున్నాం, ఎందుకంటే మీరు మా బాధ్యత అన్న మహేష్ డైలాగ్ కంప్లీట్ అవ్వగానే, సీమలో సీన్ సెట్ చేసాడు. అజయ్ ను ఉద్దేశించి మహేష్ “మిమ్మల్ని ఎలా చంపుకుంటాంరా.. మేమేమో మీకోసం అక్కడ ప్రాణాలు ఇస్తుంటే మీరు ఇక్కడ.. కొంచెం కూడా బాధ్యత ఉండక్కర్లేదా” అని మహేష్ కోపంగా చెబుతుంటే మంచి ఫన్ వస్తుంది. ఇక మహేష్ మాస్ డైలాగ్ కూడా ఈ టీజర్ లో పెట్టారు. “భయపడేవాడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాలు లేవమ్మా” అనడం ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.

ఈ టీజర్ లో రష్మిక మందన్నను చూపించలేదు. ఇందులో కీలక పాత్రలు వేసిన రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, విజయశాంతిల పాత్రలను మాత్రం పరిచయం చేసాడు. విజయశాంతి “గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్” అంటూ ప్రాసతో కూడిన ఒక డైలాగ్ వేస్తుంది. ఇక ఆఖర్లో ప్రకాష్ రాజ్ వేసిన పంచ్ అయితే సినిమాపై హైప్ ను ఒక రేంజ్ లో పెంచేసింది. “ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అన్న డైలాగ్ మహేష్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్కునిస్తుంది అనడంలో సందేహం లేదు. లాస్ట్ లో కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్ లో మహేష్ ను నుంచో పెట్టి టీజర్ కు ముగింపునిచ్చాడు.

మొత్తానికి సరిలేరు నీకెవ్వరు టీజర్ మహేష్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి స్పెషల్ గా కట్ చేసిన టీజర్ లా అనిపిస్తుంది. ఈ టీజర్ తో అంచనాలు ఆకాశాన్ని అంటుకోవడం ఖాయం. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలవుతున్న సంగతి తెల్సిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు.