సీటీమార్ నిజంగానే సీటీ కొట్టిస్తారా?


Seeti Maar success important for Gopichand and Sampath Nandi
Seeti Maar success important for Gopichand and Sampath Nandi

యాక్షన్ హీరోగా పేరొందిన గోపీచంద్ కు హిట్ వచ్చి చాలా కాలమైంది. లౌక్యం సినిమా తర్వాత అతని నుండి చెప్పుకునే స్థాయిలో సినిమా ఏదీ రాలేదు. లాస్ట్ గా వచ్చిన చాణక్య సినిమాకైతే మినిమమ్ స్థాయి వసూళ్లు కూడా లేకపోవడంతో ట్రేడ్ పండితులు సైతం విస్తుపోయారు. గోపీచంద్ కు మార్కెట్ మరీ ఇంతలా పడిపోయిందా అన్న డౌట్ అందరిలోనూ వచ్చింది. ఈ నేపథ్యంలో గోపీచంద్ చేస్తున్న తాజా సినిమా సీటీ మార్. సంపత్ నంది దర్శకుడు.  వీరిద్దరూ కలిసి ఇదివరకు గౌతమ్ నంద అనే సినిమా తీశారు.

సినిమాకు బాగుందనే పేరు వచ్చినా కానీ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఐతే గోపీచంద్ ను భిన్నంగా ప్రెజంట్ చేశాడన్న పేరు సంపత్ నందికి వచ్చింది. ఇదే కారణంతో గోపీచంద్ మరోసారి ఈ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి చేస్తున్న సీటీ మార్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎలాగైనా సమ్మర్ కు చిత్రాన్ని విడుదల చేయాలన్న టార్గెట్ తో యూనిట్ పనిచేస్తోంది.

సంపత్ నంది అంటేనే కమర్షియల్. తన సినిమాల్లో కథ తదితర విషయాల కన్నా కమర్షియల్ అంశాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మాస్ కు నచ్చే విధంగా సినిమాలు తీయడంలో సంపత్ నందికి మంచి గురి ఉంది. అయితే ఈ దర్శకుడి నుండి కూడా చెప్పుకునే స్థాయిలో రీసెంట్ గా సినిమాలు లేవు. బెంగాల్ టైగర్ యావరేజ్ గా ఆడింది. గౌతమ్ నంద ఇందాక చెప్పుకున్నట్లే కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితిలో పడ్డాడు. ఇలా ఏ రకంగా చూసినా సీటీమార్ సక్సెస్ అటు గోపీచంద్ కు ఇటు సంపత్ నంది ఇద్దరికీ చాలా అవసరం. ప్రస్తుతం ఇదే కసితో ఇద్దరూ ముందుకెళుతున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మళ్ళీ ఇద్దరూ తమ తమ కెరీర్ ల స్పీడ్ పెంచుతారేమో. తమన్నా ఈ చిత్రంలో కథానాయిక.