జబర్దస్త్ పై ఆసక్తి చూపిస్తున్న మా అధ్యక్షుడు


జబర్దస్త్ పై ఆసక్తి చూపిస్తున్న మా అధ్యక్షుడు
జబర్దస్త్ పై ఆసక్తి చూపిస్తున్న మా అధ్యక్షుడు

జబర్దస్త్ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నవ్వుల రాజు నాగబాబు జబర్దస్త్ తో తనకున్న ఏడున్నరేళ్ళ అనుబంధాన్ని తెంచేసుకుని జీ తెలుగులో వేరే షో చేయడానికి కమిటైన సంగతి తెల్సిందే. జబర్దస్త్ ను, నాగబాబును విడదీసి చూడటానికి ఇప్పటికీ ఎవరికీ మనసు ఒప్పట్లేదు. తన నవ్వులతో జబర్దస్త్ కు ఒక కళ తీసుకొచ్చిన నాగబాబు, ఎన్నోసార్లు జబర్దస్త్ కు పెద్దన్న పాత్ర పోషించి అండగా నిలబడ్డాడు. కారణాలు ఏవైనా ఇప్పుడు నాగబాబు జబర్దస్త్ నుండి దూరమయ్యాడు. ఇప్పటికీ ఇంకా జబర్దస్త్ షో లో జడ్జిగా ప్రత్యామ్నాయం దొరకలేదు. ఏడున్నరేళ్ళు జబర్దస్త్ ను అంటిపెట్టుకుని ఉన్న నాగబాబు వెళ్ళిపోతే ఆయనకీ ప్రత్యామ్నాయం వెతకడానికి యాజమాన్యం కిందా మీదా పడుతున్నారు. అలీ, సాయి కుమార్, బండ్ల గణేష్ అంటూ వివిధ పేర్లను పరిశీలించి వారితో సంప్రదింపులు జరిపారు కూడా. అయితే ఏదీ సెట్ అవ్వట్లేదు.

ఇదిలా ఉంటే సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు నరేష్ జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించడానికి తనకు ఆసక్తి ఉందని చెప్పకనే చెప్పాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ ను చూస్తుంటానని చాలా ఎంజాయ్ చేస్తానని అన్నాడు. ఈ షో అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఇలాంటి సక్సెస్ఫుల్ షో కు జడ్జిగా వ్యవహరించమంటే తప్పకుండా ముందుకు వస్తానని అంటున్నాడు. ఒక వైపు సినిమాలు, మరోవైపు మా పనులు ఉన్నా సరే వీలు కుదుర్చుకుంటానని చెప్పాడు. అయితే డైరెక్ట్ గా రెడీ అని చెప్పేయకుండా ముందు అవకాశం రానివ్వండి తర్వాత ఆలోచిద్దాం అంటూ తాను అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. నిజానికి సీనియర్ నరేష్ అనే ఆప్షన్ కూడా మంచిదే, ఒక దశలో రాజేంద్ర ప్రసాద్ కు పోటీగా కామెడీ హీరోగా ఎదిగాడు నరేష్. ఇప్పటికీ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడు. క్యారెక్టర్ నటుడిగా మారాక కూడా కామెడీ టచ్ ను వదలట్లేదు నరేష్. ఎక్కువగా అలాంటి పాత్రలే చేస్తున్నాడు. కామెడీపై మంచి గ్రిప్ ఉన్న సీనియర్ నరేష్, కామెడీ ప్రధానంగా సాగే జబర్దస్త్ షో కు జడ్జిగా వ్యవహరిస్తే వినడానికి బానే ఉంది. మరి మల్లెమాల అండ్ ఈటివి యాజమాన్యం ఏమనుకుంటున్నారో తెలియదు.

ఇకపోతే నాగబాబు జబర్దస్త్ నుండి ఎందుకు బయటకొచ్చేసానో చెబుతానని తన యూట్యూబ్ ఛానల్ లో రోజుకొక వీడియో పెడుతున్నాడు. ఇందులో జబర్దస్త్ ఎలామొదలైంది, టీమ్ లీడర్లుగా ఎవరెవరు ఉన్నదీ, తర్వాత షో ఎలా మారింది అంటూ పురాణం మొత్తం చెప్పుకొస్తున్నాడే తప్ప అసలు విషయంపై స్పందించట్లేదు. ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాడు. కనీసం అందులోనైనా అసలు రీజన్ చెబుతాడేమో చూడాలి. నాగబాబుతో పాటు జబర్దస్త్ నుండి యాంకర్ అనసూయ, కంటెస్టెంట్స్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్, కిరాక్ ఆర్పీ అండ్ టీం, ఇదివరకు జబర్దస్త్ షో లో మెరిసిన వేణు అందరూ, నాగబాబుతో పాటే జీ తెలుగులో మొదలైన లోకల్ గ్యాంగ్స్ లో చేరిన విషయం తెల్సిందే. మరి ఈ షో జబర్దస్త్ రేంజ్ లో సక్సెస్ అవుతుందా అన్నది చూడాలి.