భారీ తారాగణంతో నిండిపోతున్న రంగమార్తాండ


Shivatmika roped in Krishna Vamsis Rangamartanda
Shivatmika roped in Krishna Vamsis Rangamartanda

కృష్ణవంశీకి క్రియేటివ్ దర్శకుడిగా టాలీవుడ్ లో ఉన్న పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో తనదైన శైలిలో తెరకెక్కించి విజయం సాధించాడు కృష్ణవంశీ. తాను చెప్పాలనుకున్న కథను ఎంతో బోల్డ్ గా, ఏ మాత్రం సంశయం లేకుండా చెప్పగలగడం కృష్ణవంశీ ప్రత్యేకత. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు ఈ దర్శకుడు. అయితే కృష్ణవంశీ హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఎన్ని సినిమాలు చేస్తున్నా కృష్ణవంశీ స్థాయి హిట్ అయితే ఈ మధ్య కాలంలో రాలేదు. 2017లో విడుదలైన నక్షత్రం సినిమాతో కృష్ణవంశీ తన స్థాయిని తగ్గించేసుకున్నాడు.

అందుకే కొంత కాలం గ్యాప్ తీసుకున్న కృష్ణవంశి ఇప్పుడు మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. నట సామ్రాట్ పేరుతో మరాఠిలో విడుదలైన చిత్రాన్ని తెలుగులో మన నేటివిటీకి తగ్గ మార్పులను చేస్తూ తెరకెక్కించనున్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెల్సిందే. సినీ రంగం నేపథ్యంలో ఈ చిత్రంతెరకెక్కనుంది. ఈ చిత్రంతో కృష్ణవంశీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.

రంగమార్తాండలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించనున్న సంగతి తెల్సిందే. అలాగే లెజండరీ హాస్య నటుడు బ్రహ్మానందం ఈ చిత్రంలో తన ఇమేజ్ కు విభిన్నమైన పాత్ర పోషించనున్నాడు. ఇప్పటికే అనసూయ, బిగ్ బాస్ 3 విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజశేఖర్ కూతురు శివాత్మిక ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించబోతోందిట. దొరసాని చిత్రం ప్లాపైనా కూడా ఈమెకు మంచి నటిగా పేరొచ్చింది. మరి రెండో సినిమానే కృష్ణవంశీ వంటి దర్శకుడి దగ్గర చేస్తోందంటే నటిగా ఆమె స్థాయి పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.