హీరో శింబు మ‌ళ్లీ మొద‌లుపెట్టాడు!

హీరో శింబు మ‌ళ్లీ మొద‌లుపెట్టాడు!
హీరో శింబు మ‌ళ్లీ మొద‌లుపెట్టాడు!

తెలుగులో `మ‌న్మ‌థ‌`, వ‌ల్ల‌భ వంటి రొమాంటిక్ ల‌వ్‌స్టోరీస్‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యాడు. త‌న‌దైన స్టైల్‌తో ఆక‌ట్టుకున్న శింబు గ‌త కొంత కాలంగా త‌న చ‌రిష్మాని కోల్పోతూ వచ్చాడు. లావు పెరిగాడు. త‌న స్టైల్‌కి భిన్నంగా అత‌ని కెరీర్ వెళుతూ వ‌చ్చింది. హీరోయిన్ల‌తో ప్రేమ‌లు.. బ్రేక‌ప్‌లు శింబు సినీ కెరీర్‌ని ప‌క్క‌దారి ప‌ట్టించాయి.

తాజాగా వాట‌న్నింటిని ఓవ‌ర్ క‌మ్ చేసి మ‌ళ్లీ త‌న స‌త్తాని చాటుకోవ‌డానికి శింబు సిద్ధ‌మ‌య్యాడు. త‌న‌ని తాను కొత్త‌గా మ‌లుచుకుని న‌టిస్తున్న తాజా చిత్రం`ఈశ్వ‌రుడు`. కార్తితో `నా పేరు సూర్య‌` వంటి విభిన్న‌మైన చిత్రాన్ని అందించి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సుశీందిర‌న్ ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

దీ కంప‌నీ కెవీ దురై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. త‌మిళంలో `ఈశ్వ‌ర‌న్‌` పేరుతో రూపొందుతోంది. అదే చిత్రాన్ని తెలుగులో `ఈశ్వ‌రుడు` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌కుడిగా లుంగీ క‌ట్టి పొలంలో దిగిన శింబు మెడ‌కు పాముతో ఈశ్వ‌రుడిలా క‌నిపిస్తున్నాడు. గ‌తంలో ఎలాంటి లుక్‌తో వుండేవాడో మ‌ళ్లీ అదే లుక్‌కి మార‌డంతో శింబు మ‌ళ్లీ మొద‌లుపెట్టాడ‌ని అంతా అంటున్నారు. త‌మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు.