బీర్ బాటిల్స్ తో సింగర్ రాహుల్ పై దాడి

 

Singer rahul sipligunj attacked with beer bottles
Singer rahul sipligunj attacked with beer bottles

బిగ్ బాస్ 3తో ఎనలేని ఖ్యాతి సంపాదించుకున్నాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఎవరూ ఊహించని విధంగా క్రేజ్ సంపాదించుకుని బిగ్ బాస్ టైటిల్ కూడా కైవసం చేసుకున్న రాహుల్ కు తర్వాత పాటలు పాడే అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ప్రతిరోజూ పండగే చిత్రంలో తకిట తకిట పాటతో మరోసారి ఫేమస్ అయ్యాడు రాహుల్. అల వైకుంఠపురములో చిత్రంలోని ఓ మై గాడ్ డాడీ పాటలో రాహుల్ కూడా గొంతు కలిపాడు. ఇలా తన సింగింగ్ కెరీర్ విజయవంతంగా దూసుకుపోతోన్న సమయంలో నిన్న అర్ధరాత్రి జరిగిన సంఘటన తన జీవితంలో మచ్చగా మిగిలిపోనుంది. నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న తరుణంలో మరొక గ్యాంగ్ తో జరిగిన గొడవ వల్ల రాహుల్ సిప్లిగంజ్ గాయపడినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ప్రిజం పబ్ కు రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఆ గ్యాంగ్ లో ఒక అమ్మాయి కూడా ఉంది. రాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో రాహుల్ గ్యాంగ్ లోని అమ్మాయితో రంగారెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు దాంతో రాహుల్ అండ్ కో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ పై బీర్ బాటిల్స్ తో దాడి జరిగింది. రాహుల్ ముక్కుకు, తలపై చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ రాహుల్ కు చికిత్స చేసి పంపించారు.

పోలీసులు ఈ సంఘటనపై విచారణ జరుపుతుండగా రాహుల్ అవతలి గ్యాంగ్ పై కేసు నమోదు చేయడానికి ఇష్టపడలేదు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా తీసుకుని కేసుని దర్యాప్తు చేస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేసిన పిమ్మట నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో, నిజంగా ఈ గొడవలో ఎవరి తప్పు ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు.