థియేటర్లకు కరువు కాలం మొదలైంది


single screens in telugu states struggling with no audience
single screens in telugu states struggling with no audience

ఏడాది పొడుగునా మనల్ని సినిమాలు అలరిస్తూనే ఉన్నా థియేటర్లకు కొన్ని నెలలు కష్టకాలం ఉంటూ వస్తుంది. అలాంటి కాలంలో నవంబర్ కూడా ఒకటి. దసరా, దీపావళి పండగల తర్వాత ప్రేక్షకులందరూ తమ రొటీన్ లో పడిపోతారు కాబట్టి సినిమాలు చూడటం తగ్గిస్తారు. పైగా పండగల్లో సినిమాలు చూసి ఉంటారేమో అప్పుడే ఎందుకులే అనుకుంటారు. ఫిబ్రవరి, మార్చ్ నెల కూడా అంతే. పరీక్షల సీజన్ కావడంతో ఈ రెండు నెలల్లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు పెద్దగా ఇష్టపడరు. ఈ నెలల్లో థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతాయి. మంచి సినిమా ఏదైనా వస్తే ఓకే కానీ లేదంటే మాత్రం పరిస్థితి ఘోరమే.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఇంచుమించు ఘోరానికి దగ్గర్లో ఉంది. సైరా తర్వాత థియేటర్లను మోతమోగించే సినిమా ఒక్కటి కూడా రాలేదు. దీపావళికి ఖైదీ, విజిల్ అంటూ రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చి పర్వాలేదనిపించాయి. గత వారం విడుదలైన తిప్పరా మీసం తొలి ఆట దాటగానే చతికిలపడింది. అంతకుముందు వచ్చిన మీకు మాత్రమే చెప్తా వీకెండ్ దాటగానే చతికిలపడింది. ఇక మిగతా సినిమాల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.

కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ లేక థియేటర్లు నష్టపోతున్నాయి. మల్టిప్లెక్స్ లు ఇంగ్లీష్, హిందీ అంటూ ఏదొక సినిమా ఆడిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ల పరిస్థితే నానాటికీ తీసికట్టు అన్న చందాన తయారైంది. ఒక్కో షో కు కేవలం 4 వేల నుండి 5 వేల గ్రాస్ వస్తుండడంతో థియేటర్ల రెంటల్స్ కూడా వెనక్కి రాని పరిస్థితి. రేపు సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నా దీనికి ఏమాత్రం బజ్ లేదు. సందీప్ కిషన్ ఫామ్ కోల్పోయి చాలా కాలమైంది. ఏదో మౌత్ టాక్ మీద ఈ సినిమా ఆడాలి తప్ప మొదటి షో నుండే జనాలు థియేటర్ల ముందు బారులు తీరే పరిస్థితి లేదు. క్రిస్మస్ వారాంతం వచ్చే వరకూ థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది.