మన్మథుడు రూట్ లోనే వెళుతున్న తేజ్


మన్మథుడు రూట్ లోనే వెళుతున్న తేజ్
మన్మథుడు రూట్ లోనే వెళుతున్న తేజ్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరసగా ఆరు ప్లాపుల తర్వాత ఈ ఏడాది చిత్రలహరి చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే. అయితే పూర్తి స్థాయిలో మార్కెట్ రావాలంటే మాత్రం తేజ్ సూపర్ డూపర్ హిట్ ను కొట్టి తీరాలి. ఆ సినిమా ఇప్పుడు పూర్తి చేసిన ప్రతిరోజూ పండగే అవ్వగలదని అనుకుంటున్నాడు తేజ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. తేజ్ కు తాత పాత్రలో సత్యరాజ్ నటించిన విషయం తెల్సిందే. మనిషి పుట్టినప్పుడు ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటామో, ఒక మనిషి పరిపూర్ణ జీవితాన్ని గడిపి చనిపోయినప్పుడు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుని అతణ్ణి సాగనంపాలి అనే భిన్నమైన కాన్సెప్ట్ తో ప్రతిరోజూ పండగే తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న రాశి ఖన్నాకు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం అత్యవసరమే. ఇప్పటికే థమన్ సంగీత సారధ్యంలో రూపొంది విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాపై అన్నీ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో ప్రతిరోజూ పండగే తన కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం కాగలదని విశ్వాసంతో ఉన్నాడు.

ప్రతిరోజూ పండగే షూట్ ను పూర్తి చేసుకున్న వెంటనే తేజ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశాడు. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు. సుబ్బు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్ ఇది. వినగానే యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉందిగా. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుందిట. అమ్మాయిలని అసహ్యించుకునే అబ్బాయిగా, అసలు అమ్మాయిలంటే పడని వ్యక్తిగా ఈ చిత్రంలో తేజ్ కనిపిస్తాడట. వింటుంటే ఎక్కడో చూసిన కాన్సెప్ట్ గుర్తొస్తోందిగా.

నాగార్జున హీరోగా గతంలో వచ్చిన మన్మథుడు సినిమా స్టోరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దీంతో నాగ్ రూట్ లోనే తేజ్ కూడా వెళుతున్నాడని కామెంట్స్ మొదలయ్యాయి. సినిమా కాన్సెప్ట్ అలాగే ఉన్నా ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందని తెలుస్తోంది. కాన్సెప్ట్ ఒకటే అలా ఉంటుందని, టేకింగ్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం అందింది. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటిదాకా తేజ్ – థమన్ కాంబినేషన్ లో వచ్చిన పాటలు హిట్ అయినా సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. ఈసారి పక్కాగా హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇద్దరూ. అది ప్రతిరోజూ పండగేతో మొదలై, సోలో బ్రతుకే సో బెటర్ కు కూడా కంటిన్యూ అవ్వాలని తేజ్ – థమన్ భావిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే తేజ్ ప్రకటించిన విషయం తెల్సిందే.