రూమ‌ర్‌ల‌కు చెక్ పెట్టిన సోనాక్షి!


Sonakshi Sinha clarify the rumors
Sonakshi Sinha clarify the rumors

బాలీవుడ్ హీరోయిన్‌లు టాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో క‌త్రినా కైఫ్‌, ఐశ్వ‌ర్యారాయ్ (రావోయి చంద‌మామ‌), అంజ‌లా ఝ‌వేరి, సొనాలి బింద్రే, రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ వంటి క్రేజీ క‌థానాయిక‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్రి త‌మ అంద‌చందాల‌తో మెస్మ‌రైజ్ చేశారు. అదే త‌ర‌హాలో బాలీవుడ్ సొగ‌స‌రి సోనాక్షి సిన్హా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతోంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం మొద‌లైంది. త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `లింగా` చిత్రంలో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అయితే తెలుగులో మాత్రం ఆమె ఇంత వ‌ర‌కు సినిమా చేయ‌లేదు.

బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఓ భారీ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ సొనాక్షి సిన్హా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతుంద‌నే వార్త‌లు గ‌త కొన్ని రోజులుగా ఫిలిం స‌ర్కిల్స్‌లో షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని సోనాక్షి కొట్టిపారేసింది. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన ఆమె `బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో రానున్న చిత్రంలో నేను న‌టించ‌బోతున్నాన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దానిపై క్లారిటీ ఇవ్వాల‌నుకుంటున్నాను. ఆవార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు. నా నెక్స్ట్ ఫిల్మ్ గురించి త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాను` అని స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

సొనాక్షి ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న ద‌బాంగ్ సిరీస్ `ద‌బాంగ్ 3` చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌భుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టికే రిలీజై సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. కన్న‌డ హీరో సుదీప్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న తెలుగు, త‌మిళ‌. క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.