“సినిమాలపై సొంత పైత్యం” ఇంకెంత కాలం.?


“సినిమాలపై సొంత పైత్యం” ఇంకెంత కాలం.?
“సినిమాలపై సొంత పైత్యం” ఇంకెంత కాలం.?

“కళ అనేది మన కోసం కాదు .. జనం కోసం” అని గతంలో ఒక పెద్దాయన చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి కదా..! మనకు మొత్తం 64 కళలు ఉన్నాయి. వాటిలో ఆంగికం, వాచికం, ఆహార్యం మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాల పరంగా అగ్రస్థానంలో ఉన్న కళారూపం చలన చిత్రం. అంటే మనకు తెలిసిన అన్నింటిలో సినిమా అనేది గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్. అలాంటి సినిమాలు ప్రస్తుతం డబ్బు కోసం ఎన్నో రకాల వాణిజ్యపరమైన భావ దారిద్యానికి గురయ్యాయి. దీనితోపాటు ప్రస్తుతం ఒకరి పై కోపంతోనో , పగతోనో , లేదా గతంలో ఒకరి వల్ల కలిగిన నష్టానికి ప్రతీకారం గానో, లేదా ఉద్దేశ్యపూర్వకంగా కొంతమంది వ్యక్తులను లేదా ప్రాంతాలను ఎగతాళి చేసి, కించపరిచే విధంగా తయారు అయ్యాయి. ఇది ఏ మాత్రం మంచి పరిణామం కాదు. గతంలో ఇలాంటి చర్యలు కేవలం పేపర్ లలో రాతలకు పరిమితం అయ్యేవి. ఇప్పుడు అలా కాదు,

ఎంతో అనుభవం ఉండి, ఇంకొకరికి ఆదర్శంగా నిలవవలసిన వారే ఇలా కళాద్రోహానికి పాల్పడుతున్నారు. ఉదాహరణకు దేశం గర్వించే స్థాయి కలిగిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”  సినిమాలో కథ, కథనం, టేకింగ్, క్వాలిటీ, ఇలా ఏమీ పట్టించుకోకుండా కేవలం తను ప్రత్యర్ధులుగా భావించిన వాళ్ళ బలహీనతలు చూపించడమే చేసాడు.

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా, గతంలో తాను చేసిన లెజెండ్,లయన్, గౌతమీపుత్ర శాతకర్ణి , ఇప్పుడు తాజాగా రూలర్ సినిమాలలో అన్యాపదేశంగా ప్రత్యర్దులపై మాటల తూటాలు వదులుతూనే ఉన్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో సౌరాష్ట్ర (గుజరాత్) ప్రస్తుతం రూలర్ లో ఉత్తర ప్రదేశ్ ఇలా చెప్పుకుంటే మనం చాల పాయింట్స్ వెతకచ్చు. మనల్ని హీరోగా  లేదా మనల్ని గొప్ప చేసుకోవాలంటే ఎదుటివారిని తక్కువ చెయ్యమని కాదు కదా.! అదేవిధంగా, అనుకూల ప్రతికూల అంశాలు అందరిలో ఉంటాయి. అన్నిటికీ మించి మన సొంత పైత్యం సినిమాకి అంటించి, దాన్ని అభిమానుల మాధ్యమంగా జనాలపై రుద్దటం అనేది చాలా తప్పు అనే విషయం తెలిసి కూడా కొనాసాగిస్తున్నారు అంటే, కాలమే దీనికి సమాధానం చెప్పాలి .