అనసూయ అటు జంప్.. ఆమె స్థానంలో శ్రీముఖి?


Sreemukhi and Anasuya
Sreemukhi and Anasuya

చూస్తుంటే బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి సుడి తిరిగినట్లుంది. బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా కానీ శ్రీముఖి డిమాండ్ బుల్లితెరపై గతం కంటే బాగా పెరిగింది. రెమ్యునరేషన్ కూడా 50 శాతం పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం శ్రీముఖి ఇప్పటికే స్టార్ మా లో ఒక కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతోంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక శ్రీముఖి చేస్తోన్న ఫస్ట్ షో ఇదే. ఇంకా పేరు బయటకు వెల్లడించని ఈ షో కాకుండా శ్రీముఖికి మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం.

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్ద హిట్ కామెడీ షో జబర్దస్త్ కు ఒక యాంకర్ గా శ్రీముఖిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్ మొదలై ఇన్నేళ్ళైనా అనసూయ మొదటినుండి ఈ షో కు యాంకర్ గా వ్యవహరిస్తోంది. మధ్యలో అనివార్య కారణాల వల్ల కొన్ని వారాలు తప్పుకున్నప్పుడు ఆమె స్థానంలో రేష్మి వచ్చింది. అయితే అనసూయ తిరిగి వచ్చాక రేష్మిని తప్పించకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ అని ఇంకో ప్రోగ్రాంను మొదలుపెట్టి దానికి రేష్మిని యాంకర్ ను చేసారు. ఇప్పుడు జబర్దస్త్ కంటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్కువ టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో మరో కామెడీ షో మొదలవుతున్న సంగతి తెల్సిందే. లోకల్ గ్యాంగ్ పేరుతో ఆ షో మొదలవుతుండగా దానికి ఒక జడ్జిగా ఇప్పటికే నాగబాబు కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. జబర్దస్త్ షో మొదలైనప్పటి నుండి నాగబాబు ఒక జడ్జిగా కొనసాగుతూ వచ్చారు. మధ్యలో అనసూయ లానే కొన్ని వారాలు దూరమైనా మళ్ళీ తిరిగి జబర్దస్త్ కే చేరారు. అయితే ఇప్పుడు కారణాలు తెలీవు కానీ జబర్దస్త్ ను వదిలి ఈ కొత్త షో కు వెళ్లారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ షో త్వరలో టెలికాస్ట్ అవ్వబోతోంది.

ఇందులో మరో జడ్జిగా అనసూయను తీసుకున్నారు. అందుకే జబర్దస్త్ మొదలైనప్పటి నుండి ఉన్న అనసూయ ఇప్పుడు ఆ షో ను వీడింది. యాంకర్ నుండి జడ్జిగా ప్రమోషన్ లభించడంతో సంతోషంగా ఒప్పేసుకుంది. ఈ లోకల్ గ్యాంగ్ షో కి ప్రదీప్, రవి లేదా సుధీర్ హోస్ట్ లుగా వ్యవహరించబోతున్నారు. నాగబాబు, అనసూయతో పాటు మరికొందరు కమెడియన్స్ జబర్దస్త్ ను వీడి ఈ కొత్త షో కు వస్తున్నారు.

ఇప్పుడు అనసూయ స్థానం ఖాళీ అవ్వడంతో ఆమె ప్లేస్ లో శ్రీముఖిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనే శ్రీముఖికి జబర్దస్త్ నుండి ఆఫర్ వచ్చింది. అయితే అప్పుడు ఎందుకో దానికి ఓకే చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఈసారి వదులుకోవాలనుకోవట్లేదు. అందుకే వెంటనే శ్రీముఖి ఎస్ చెప్పేసింది. మరి ఈ లోకల్ గ్యాంగ్ భారీ హంగుల మధ్య, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా, జబర్దస్త్ రేంజ్ లో ఈ షో హిట్ అవుతుందా అన్నది చూడాలి. జబర్దస్త్ నుండి చమ్మక్ చంద్ర కూడా బయటకు వచ్చిన విషయం తెల్సిందే.