ఏఎన్నార్ జాతీయ అవార్డులు ప్రకటన.. విజేతలు వీరే!


ఏఎన్నార్ జాతీయ అవార్డులు ప్రకటన.. విజేతలు వీరే!
ఏఎన్నార్ జాతీయ అవార్డులు ప్రకటన.. విజేతలు వీరే!

లెజండరీ నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత అంతుకు మించిన మహా మనిషి దివంగత అక్కినేని నాగేశ్వరరావు స్మారక చిహ్నంగా ఏఎన్నార్ జాతీయ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే. దేశవ్యాప్తంగా సినిమా కోసం పనిచేసిన లెజెండరీ నటీనటులను, సాంకేతిక నిపుణులను గుర్తించి వారికి ఈ జాతీయ అవార్డు ఇచ్చి గౌరవిస్తుంటారు. ఇందుకోసం ఒక జ్యురీను కూడా ఏర్పాటు చేసారు. 2006లో ఈ అవార్డును ప్రవేశపెట్టగా మొదటిసారి దేవ్ ఆనంద్ ఈ అవార్డును గెల్చుకున్నారు. చివరిగా 2017లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిని ఈ అవార్డు వరించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2018లో అవార్డును ప్రకటించలేదు. అయితే ఈరోజు 2018, 2019 సంవత్సరాలకు గాను అవార్డులను ప్రకటించారు. ఇందుకోసం అక్కినేని నాగార్జున, కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విజేతలను ప్రకటించారు.

2018 సంవత్సరానికి దివంగత అందాల నటి శ్రీదేవికి ఈ అవార్డు దక్కగా, 2019 సంవత్సరానికి గాను అలనాటి అందాల తార రేఖను ఈ అవార్డు వరించింది. నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్ లోనే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి విచ్చేస్తారని, ఆయన చేతుల మీదుగానే అవార్డును అందజేస్తామని తెలియజేసారు. రేఖ ఈ ఫంక్షన్ కు విచ్చేస్తారని తెలిపాడు నాగార్జున. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులే కాక ఇతర రంగాల్లోని ప్రముఖులు కూడా హాజరవ్వనున్నట్లు నాగార్జున వెల్లడించాడు.