అడ్డాల చేతికి అసురన్ వెళుతోందా?


Srikanth Addala being considered for Asuran remake
Srikanth Addala being considered for Asuran remake

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో శ్రీకాంత్ అడ్డాల సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. తన కథ అడ్డం తిరిగింది. ఆ సినిమా పేరు ఏంటో ఈపాటికే తెలిసి ఉంటుందిగా. ఎస్ అదే.. బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మాయని మచ్చగా మిగిలింది బ్రహ్మోత్సవం. మహేష్ ఫ్యాన్స్ కు నిద్రలో కూడా పీడకలలు తీసుకొచ్చిందా సినిమా. ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఇప్పటివరకూ మరో సినిమా చేయలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అసలు ఈ దర్శకుడు ఏమైపోయాడు అంటూ ఎంక్వయిరీలు కూడా చేసారు. తెలిసిందేమంటే శ్రీకాంత్ అడ్డాల తన తర్వాత సినిమాకోసం కథ సిద్ధం చేసుకుంటున్నాడు. గీతా ఆర్ట్స్ మంచి కథతో వస్తే నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చింది కూడా. అయితే ఈసారి ప్లాప్ పడితే ఇక శ్రీకాంత్ అడ్డాల కెరీర్ షెడ్ కు వెళ్లడం ఖాయం. అందుకే జాగ్రత్తగా తన తర్వాతి చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. తన స్టైల్ కు భిన్నంగా ఈసారి తన సినిమా ఉంటుందని సన్నిహితులకు చెబుతున్నాడట. అయితే ఈలోగా శ్రీకాంత్ అడ్డాలకు మరో ఆఫర్ వచ్చింది. అదే అసురన్ రీమేక్.

ఈ మధ్య కాలంలో తమిళంలో వచ్చిన బెస్ట్ సినిమాగా అసురన్ ను అభివర్ణిస్తున్నారు. సినిమా చూసిన ప్రతిఒక్కరూ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ధనుష్ నటన, వెట్రిమారన్ టేకింగ్ ఇలా ఏది చూసుకున్నా అసురన్ టాప్ రేంజ్ లో ఉంది. ఈ సినిమాతో ధనుష్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సైతం సాధించాడు. కల్ట్, రా అండ్ ఇంటెన్స్ కథగా అసురన్ ఉంటుంది. కులాల మధ్య అంతరాన్ని అసురన్ ప్రశ్నిస్తుంది. ఇలాంటి సినిమాపై వెంకటేష్ మనసు పారేసుకున్నాడు. సినిమా చూసిన వెంటనే నచ్చేసి సురేష్ బాబుతో కలిసి వెళ్లి ఆ సినిమా హక్కుల్ని కొనేసుకున్నాడు. ఇంత వరకూ బానే ఉంది కానీ అసలు ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్న దగ్గర అసలు గొడవ మొదలైంది.

అసురన్ ను రీమేక్ చేయడం అంత సులువైన వ్యవహారం కాదు. అసురన్ లో తమిళ వాసనలు ఉంటాయి. వాటిని తెలుగు అభిరుచికి తగ్గట్లుగా మార్చాలి. అసురన్ లో ఉండే ఇంటెన్సిటీని మ్యాచ్ చేయగలగాలి. ధనుష్ లెవెల్లో వెంకటేష్ నుండి పెర్ఫార్మన్స్ ను రప్పించగలగాలి. వీటిని హ్యాండిల్ చేయగల దర్శకుడి కోసం సురేష్ బాబు వెతుకులాట కొనసాగుతోంది. ప్రేమ కథలు తీసే హను రాఘవపూడి పేరు కొన్ని రోజుల క్రితం వినిపించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాలను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ ఇదివరకు శ్రీకాంత్ అడ్డాలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పనిచేసాడు. ఇద్దరి మధ్య ఆ ర్యాపొ ఉంది. అందుకే ఎస్ చెప్పి ఉంటాడు. అసలు శ్రీకాంత్ అడ్డాల స్టైల్ కు ఈ సినిమా పూర్తిగా భిన్నం. మరి ఇలాంటి శ్రీకాంత్ హ్యాండిల్ చేయగలడా? అసలు ఓకే చెప్తాడా? తన కెరీర్ అసలే రిస్క్ లో ఉన్న సమయంలో ఇలాంటి రిస్క్ అవసరమా?.