వరస ప్లాపులతో పూర్తిగా డీలా పడ్డ కింగ్ ఖాన్


వరస ప్లాపులతో పూర్తిగా డీలా పడ్డ కింగ్ ఖాన్
వరస ప్లాపులతో పూర్తిగా డీలా పడ్డ కింగ్ ఖాన్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా హిందీ ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంగా ఏలాడు. హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ నుండి గట్టి పోటీ ఉన్నా కానీ షారుఖ్ ఖాన్ స్థాయి ఎప్పుడూ వేరు. వారిద్దరి కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండేవాడు. అయితే ఈ మధ్య కాలంలో కింగ్ ఖాన్ కు ఏదీ పెద్దగా కలిసిరావట్లేదు. చెన్నై ఎక్స్ప్రెస్ నుండి నిఖార్సైన హిట్ అన్నదే లేదు ఖాన్ కు. బాలీవుడ్ లో ఎంతో మంది టాప్ దర్శకులున్నా, ఎంతో మందితో ఎన్నో ప్రయత్నాలు చేసినా షారుఖ్ ప్రయత్నాలు మాత్రం ఒక్కటీ ఫలించలేదు. వరస ప్లాపులతో షారుఖ్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంది. అసహనం, అసహాయత కూడా చుట్టుముట్టాయి. ఇలానే ప్లాపులు అందిస్తే ప్రేక్షకులు నన్ను మర్చిపోతారేమో, ఎందుకంటే సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రారుగా అన్నాడంటే షారుఖ్ ఎంత నిస్సహాయతలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. అయినా కూడా తర్వాత చేసిన జీరో నిరాశనే మిగిల్చింది. సల్మాన్ ఖాన్ తో స్పెషల్ రోల్ వేయించినా కానీ ఫలితాన్నివ్వలేదు.

ఇక ఇలా కాదని చెప్పి, వర్కింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్నిటినీ ఆపేసాడు. అన్నీ స్క్రాప్ చేసేసాడు. కొంత కాలం బ్లాంక్ గా గడిపేశాడు. అసలు సినిమా ఆలోచనలే పెట్టుకోలేదు. సంవత్సరమైనా కొత్త సినిమా ఊసు ఎత్తలేదు. ఐతే ఫైనల్ గా నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కింగ్ ఖాన్. ఎలాంటి సినిమా చేయాలన్న ఉద్దేశంలో క్లారిటీ రాకపోయినా కథలైతే వింటున్నాడు. అయితే ఏదీ తనని ఎగ్జైట్ చెయ్యట్లేదు. ఈ మధ్య బిగిల్ రిలీజ్ టైమ్ లో ఆ చిత్ర దర్శకుడు అట్లీతో షారుఖ్ సినిమా ఉంటుందని వార్తలు ప్రచారమయ్యాయి. షారుఖ్ బిగిల్ ట్రైలర్ ను ట్విట్టర్ లో ట్వీట్ చేయడం, తర్వాత అట్లీను తన పుట్టినరోజు సందర్భంగా కలవడం వంటివి ఆ వార్తలకు బలాన్నిచ్చాయి. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అట్లీను ఇదే విషయమై ప్రశ్నించగా ఏమో అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రాజెక్ట్ ఉండొచ్చేమో అన్నాడు. దాన్ని బట్టి ఇక ఈ సినిమా ఫిక్స్ అన్నట్లే వార్తలు వచ్చాయి.

కానీ ఎంత కాలమైనా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ రావట్లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందేమోనని కొత్త రూమర్ మొదలైంది. ప్రస్తుతం ఈ విషయమై స్పందించడానికి అట్లీ అందుబాటులో లేడు. షారుఖ్ ఏమో యూఎస్ టూర్ లో బిజీగా ఉన్నాడు. అతను తిరిగొస్తే ఏమైనా ఈ విషయమై క్లారిటీ వస్తుందేమో చూడాలి.