త్రివిక్రమ్ కు డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదుగా


త్రివిక్రమ్ కు డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదుగా
త్రివిక్రమ్ కు డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదుగా

త్రివిక్రమ్ బ్రాండ్ వేల్యూకు మచ్చ తెచ్చిన సినిమా అజ్ఞాతవాసి. అసలు అలాంటి సినిమాను త్రివిక్రమ్ నుండి ఎవరూ ఊహించలేదు. దర్శకుడిగా త్రివిక్రమ్ పనైపోయిందా, తన పెన్నుకు పదును తగ్గిపోయిందా అనే రేంజ్ లో విమర్శలు వచ్చాయి. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ అరవింద సమేత చేసి హిట్టు కొట్టాడు కానీ అది త్రివిక్రమ్ బలాన్ని నమ్మి తీసిన సినిమా కాదు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేసిన సినిమా. అయితే త్రివిక్రమ్ మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు మునుపటి స్థాయిలో చేయలేడా అన్న సందేహాల నడుమ విడుదలైంది అల వైకుంఠపురములో.

ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఏ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తను మనసు పెట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి నిరూపించాడు. అల వైకుంఠపురములో చిత్రానికి ఇప్పటికీ హౌస్ ఫుల్స్ నమోదవుతుండటం విశేషం. ఈ రేంజ్ హిట్ ను అల వైకుంఠపురములో యూనిట్ ను ఊహించలేదు. ఇదంతా త్రివిక్రమ్ మ్యాజిక్ అని ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు.

ఈ హిట్ తో త్రివిక్రమ్ తర్వాతి సినిమాలపై ఆరాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమాకు కమిటైన విషయం తెల్సిందే. ఇది కాకుండా త్రివిక్రమ్ తో చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఎప్పటినుండో పనిచేయాలని అనుకుంటున్నాడు కానీ ఎందుకో సెట్ అవ్వట్లేదు. ఆ పనులు కూడా ముందుకు జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ ఇద్దరూ కలిసి పనిచేయవచ్చు. అంతే కాకుండా రామ్ చరణ్ తో అయితే అత్తారింటికి దారేది నుండి పనిచేయాలని అనుకుంటున్నాడు కానీ కుదరట్లేదు. ఇప్పుడు ప్రభాస్ కూడా త్రివిక్రమ్ అంటే ఆసక్తి చూపిస్తున్నాడు. భారీ సినిమాల మధ్య ఒక క్లీన్ హాయిగా సాగిపోయే ఎంటర్టైనర్ ను చేయాలని అనుకుంటున్నాడు. అంతేనా త్రివిక్రమ్ కు చిరంజీవితో కమిట్మెంట్ ఉంది. వెంకటేష్ తో చేస్తానని ఒక సందర్భంలో అన్నాడు. ఇలా త్రివిక్రమ్ క్యాలెండర్ నాలుగైదేళ్ల వరకూ ఖాళీ లేదు.