వెంకీ మామ రిలీజ్ డేట్ లో మరింత కన్ఫ్యూజన్


వెంకీ మామ రిలీజ్ డేట్ లో మరింత కన్ఫ్యూజన్
వెంకీ మామ రిలీజ్ డేట్ లో మరింత కన్ఫ్యూజన్

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన వెంకీ మామ చిత్రంపై ఇంకా రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్లు తొలగిపోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి మొదట ఈ సినిమాను అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేద్దామనుకున్నారు కానీ సరిగ్గా అప్పుడే వెంకటేష్ కు గాయం కావడంతో షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. అక్టోబర్ చివరికి షూటింగ్ పూర్తయినా నవంబర్ లో స్లంప్ కారణంగా సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అందుకే సరైన రిలీజ్ డేట్ కోసం వెంకీ మామ నిర్మాత సురేష్ బాబు తెగ ప్రయత్నించాడు. సంక్రాంతికి బరిలో నిలుపుదామనుకున్నాడు కానీ అప్పటికే నాలుగు చిత్రాలు షెడ్యూల్ అయ్యి ఉండడంతో అది మంచి పద్దతి కాదని వెనక్కి తగ్గాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పుడూ చాలా క్లారిటీతో ఉంటానని, లైఫ్ లో తొలిసారి కన్ఫ్యూజ్ అవుతున్నానని, వెంకీ మామను ఎప్పుడు విడుదల చేయాలో అర్ధం కావడంలేదని పేర్కొన్నాడు.

అయితే మా టీమ్ అంతా డిసెంబర్ 13న విడుదల చేద్దామని అంటున్నారని, ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు కారణంగా అప్పుడు విడుదలైతే బాగుంటుందని భావిస్తున్నారని పేర్కొన్నాడు. సంక్రాంతి సీజన్ మిస్ అవ్వడంతో క్రిస్మస్ కైనా సినిమాను దింపుదామని అనుకున్నాడు సురేష్ బాబు. అయితే ఇక్కడ కూడా రెండు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిరోజూ పండగే, నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న రూలర్ డిసెంబర్ 20న రిలీజ్ ను ఎప్పుడో షెడ్యూల్ చేసుకున్నాయి. వీటికి పోటీగా డిసెంబర్ 25న విడుదల చేయాలా లేక డిసెంబర్ 13న విడుదల చేయాలా అని చాలా కాలం సురేష్ బాబు ఆలోచనలతోనే గడిపేశాడు.

వెంకీ మామ చిత్రాన్ని డిసెంబర్ 13నే విడుదల చేయాలని అనుకుంటున్నామని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు సురేష్ బాబు. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని తెలియజేసాడు. అయితే ఇలా చెప్పి పది రోజులవుతున్నా కూడా ఇంకా వెంకీ మామ రిలీజ్ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. రిలీజ్ ఏమో మరో రెండు వారాల్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై మరొక ఆసక్తికర న్యూస్ వస్తోంది. అదేటంటే యూఎస్ డిస్ట్రిబ్యూటర్ కు వెంకీ మామ సినిమా ప్రీమియర్ ను 24కి పెట్టుకోమని అప్డేట్ ఇచ్చారట. అంటే సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నారా? వెంకీ మామ టీమ్ నుండి ఎటువంటి అప్డేట్ అయితే ఉండట్లేదు.

మరి ఈ నెలాఖరులోగా ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక అప్డేట్ బయటకి వస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మేనల్లుడు – మావయ్య సెంటిమెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని అర్ధమవుతోంది. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెల్సిందే.