సుక్కూ, బన్నీ.. అప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయిందా?


Sukumar completes first schedule for allu arjun 20th movie
Sukumar completes first schedule for allu arjun 20th movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. ప్రమోషన్స్ లో దుమ్ము రేపుతున్న అల వైకుంఠపురములో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ సినిమాకు కమిట్ అయ్యాడు. గత నెలలోనే ఈ సినిమాకు ముహూర్తం కూడా జరిగింది. షూటింగ్ ఎప్పుడన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

అయితే వారం రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు ట్రయిల్ షూట్ కోసం సుకుమార్ కొంతమంది కాస్ట్ అండ్ క్రూ తో కలిసి కేరళ వెళ్లాడని న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు సుకుమార్ అండ్ కో హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. తాజాగా దీని గురించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కేరళలో షూట్ చేసింది ట్రయిల్ షూట్ కాదని, ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయిందని, హీరో లేకుండా షూటింగ్ మొదలుపెట్టి తను అవసరం లేని సీన్ల వరకూ షూట్ చేసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో క్లారిటీ లేదు.

అల వైకుంఠపురములో సినిమా విడుదలైన వారం రోజులకే అల్లు అర్జున్, సుకుమార్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసి 2020 సెకండ్ హాఫ్ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. రంగస్థలంలో హీరో వెనక ఉండే పాత్ర చేసిన శత్రు ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ తో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన వ్యక్తి కెమెరా బాధ్యతలను చూసుకుంటున్నాడు. సుకుమార్ ఆస్థాన కెమెరా మ్యాన్ రత్నవేలు ఈ సినిమాకు అందుబాటులో ఉండట్లేదు. రంగస్థలం తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ రావడంతో సుకుమార్ తొందరగా షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ విశేషాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.