సుక్కూ రీమేక్ చేయడం సాధ్యమేనా??


సుక్కూ రీమేక్ చేయడం సాధ్యమేనా??
సుక్కూ రీమేక్ చేయడం సాధ్యమేనా??

టాలీవుడ్ లో టాప్ రేంజ్ దర్శకులు చాలా మందే ఉన్నా.. ఒరిజినల్ దర్శకులు మాత్రం చాలా అరుదుగా ఉన్నారు. ఎక్కడా ఇన్స్పైర్ కాకుండా ఒరిజినల్ ఐడియాస్ తో సినిమాలు తీసే దర్శకులలో సుకుమార్ మొదటి వరసలో ఉంటాడు. ఇప్పటిదాకా సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఆర్య నుండి మొదలుపెట్టి మొన్నటి రంగస్థలం వరకూ సుకుమార్ సినిమాల్లో ఒరిజినాలిటీ కనిపిస్తుంది. ఐడియాస్ తనవి కావొచ్చు, లేదా వేరే వాళ్ళు ఇచ్చినవి కావొచ్చు… సుకుమార్ మాత్రం చాలా ఒరిజినల్ గా సినిమా తీసినట్లు అనిపిస్తుంది. అందుకే సుకుమార్ కథను లాక్ చేయడానికే చాలా సమయం తీసుకుంటాడు. దానికి స్క్రీన్ ప్లే తో మాయ చేస్తాడు. సుక్కూ సినిమాలో స్క్రీన్ ప్లే విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకుడికి ఏదొక సర్ప్రైజ్ ఇస్తాడు. అతని సినిమాలు హిట్ అవొచ్చు లేదా ప్లాప్ అవొచ్చు కానీ దర్శకుడిగా సుకుమార్ ఎప్పుడూ చెత్త సినిమా తీయలేదు. అప్పటి కాలానికి సరిపోని చిత్రమో, ప్రేక్షకుల ఆశించిన దానికి భిన్నమైన చిత్రమో వచ్చింది అంతే.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా సుకుమార్ రీమేక్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని హీరోగా పెట్టి సుకుమార్ ఒక రీమేక్ చేయబోతున్నాడు అన్నది ఆ రూమర్స్ యొక్క సారాంశం. విషయంలోకి వెళితే.. ఇటీవలే సైరా ప్రమోషన్స్ కోసం చిరంజీవి అండ్ కో కేరళ వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ రాజ్, చిరంజీవి లూసిఫెర్ చిత్ర రీమేక్ హక్కుల్ని కొన్నట్లు ప్రకటించాడు. మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెస్ట్ ఫిలిమ్స్ లో లూసిఫెర్ ఒకటిగా పేరొందింది. ఇందులో హీరోయిజంను లేపడానికి బోలెడు సన్నివేశాలున్నాయి. పూర్తి కమర్షియల్ అంశాలతో డిఫెరెంట్ గా ఉంటూనే ఫ్యాన్స్ కు ఫీస్ట్ అనిపించగల చిత్రం లూసిఫెర్. బహుశా అందుకే చిరంజీవి ఈ చిత్రం మీద మనసు పారేసుకుని ఉండొచ్చు. కానీ ఈ చిత్రానికి సుకుమార్ రీమేక్ అంటేనే నమ్మబుద్ది కావట్లేదు.

సుకుమార్ లాంటి ఒరిజినల్ దర్శకుడు ఒక రీమేక్ చేయడం అనేది నమ్మశక్యంగా అనిపించట్లేదు. రీమేక్ చేయడం తప్పు కాదు కానీ సొంత సినిమా తీసుకునే సత్తా ఉన్నప్పుడు రీమేక్ జోలికి వెళ్లడం ఎందుకు అన్నది కొంత మంది వాదన. సుకుమార్ దగ్గరే ప్రస్తుతం బోలెడు ఐడియాస్ ఉన్నాయి. ఆరేడు నెలలు సుకుమార్ కు టైమ్ ఇస్తే బ్రహ్మాండమైన కథను సిద్ధం చేయగలడు. రామ్ చరణ్ కు తన కెరీర్ బెస్ట్ చిత్రాన్ని ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయమన్నా కూడా రీమేక్ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ప్రకారం సుకుమార్ ఈ రీమేక్ ను చేయడానికి నో చెప్పాడట. అసలు రామ్ చరణ్, సుకుమార్ ను ఈ విషయమై సంప్రదించాడో లేదో కూడా తెలీదు. ఒకవేళ సుకుమార్ ను సంప్రదించకపోవచ్చు కూడా. సంప్రదించినా సుకుమార్ కు రీమేక్ లు ఇష్టం ఉండవన్నది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే సుకుమార్ నో చెప్పి ఉండవచ్చు. ప్రస్తుతం బన్నీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్.