సుకుమార్ ఒక్కడే దేవిని వదలట్లేదు


సుకుమార్ ఒక్కడే దేవిని వదలట్లేదు
సుకుమార్ ఒక్కడే దేవిని వదలట్లేదు

ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ టైమ్ టాలీవుడ్ లో అస్సలు బాలేదు. ఒకప్పుడు ఏకచత్రాధిపత్యంగా తెలుగు సినిమాను ఏలిన దేవి శ్రీ ప్రసాద్ ను ప్రస్తుతం అందరూ పక్కన పెట్టేస్తున్నారు. ఇందులో స్వయంకృతాపరాధం కూడా కొంత ఉంది. గత రెండు, మూడేళ్ళ నుండి ఒకటి రెండు ఆల్బమ్స్ తప్పితే దేవి కొట్టిన మిగతా ఆల్బమ్స్ అన్నీ రోటీన్ అన్న ముద్ర వేయించుకున్నాయి. దీంతో ఎన్నడూ లేనిది దేవి నెగటివ్ రిమార్క్స్ ను మూటగట్టుకోవాల్సి వచ్చింది. పాటలన్నీ ఒకే తరహాలో ఉంటునాయన్న రిమార్క్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో థమన్ రైజ్ అవ్వడం కూడా దేవికి ప్రతికూలంగా మారింది. వరసపెట్టి హిట్ ఆల్బమ్స్ ఇస్తూ దర్శకులలో తన మీద కాన్ఫిడెన్స్ నింపాడు థమన్. ఇప్పుడు వరసగా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం థమన్ చేతిలో ఉన్న ఆల్బమ్స్ అన్నీ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో నుండి విడుదలైన రెండు పాటలు కూడా క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తెలుగు పాటల్లో యూట్యూబ్ రికార్డులన్నింటిన్నీ ఈ రెండు పాటలు తుడిచిపెట్టేశాయి. డిస్కో రాజాలో విడుదలైన నువ్వు నాతో ఏమన్నావో సాంగ్ కూడా అదరగొట్టింది. రిట్రో ఫీల్ తో సాగుతూ కుమ్మేసింది. ఇటీవలే వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాల్లోని టైటిల్ సాంగ్స్ విడుదలయ్యాయి. ఇవి కూడా ఆయా చిత్రాల మీద రైట్ ఇంప్రెషన్ కలిగించడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇలా చేసిన ప్రతి పాటతోనూ హిట్ కొడుతున్న థమన్ నెమ్మదిగా దేవి నుండి టాప్ ప్లేస్ ను కూడా లాగేసుకుంటున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ ను ప్రస్తుతం దర్శకులు కూడా పక్కనపెట్టేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పట్లో దేవితో వరసగా సినిమాలు చేసాడు. జల్సా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది.. ఇలా వరసగా వీరి కాంబినేషన్ లో అదిరిపోయే ఆల్బమ్స్ వచ్చాయి. అయితే అ.. ఆ నుండి వీరి కాంబో విడిపోయింది. తర్వాత అజ్ఞాతవాసి, అరవింద సమేత ఇప్పుడు అల వైకుంఠపురములో.. చిత్రాలకు వేరే సంగీత దర్శకులు పనిచేసారు. తన మొదటి సినిమా నుండి దేవితో పని చేసిన కొరటాల శివ కూడా చిరంజీవి చిత్రానికి దేవిని పక్కనపెట్టేశాడు. ఈ సినిమాకు బాలీవుడ్ వాళ్ళు పనిచేయబోతున్నారు. దేవితో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి సినిమాలకు పని చేసిన కిషోర్ తిరుమల, తన తర్వాతి చిత్రం రెడ్ కు కూడా మణిశర్మను తీసుకున్నాడు. ఇలా ప్రతీ దర్శకుడూ దేవితో పనిచేయడానికి ఇష్టపడట్లేదు.

కానీ సుకుమార్ మాత్రం దేవిని వదల్లేదు. తన తొలి సినిమా నుండి ప్రతీ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమాలు ప్లాప్ అయినా కానీ వీరి కాంబోలో సాంగ్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. సుకుమార్ అల్లు అర్జున్ తో చేయబోయే చిత్రానికి దేవి శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు. ఇలా అందరూ పక్కనపెట్టేస్తున్నా సుక్కూ మాత్రం దేవినే అంటిపెట్టుకోవడం విశేషమని చెప్పాలి. మరి దేవి సుక్కూ నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి.