కమెడియన్ సునీల్ కెరీర్ ఎటు పోతోంది?


Sunil confusion about his career
Sunil confusion about his career

సునీల్ సినీ కెరీర్ చాలా విచిత్రమైనది. అవకాశాల కోసం మొదట ఇబ్బంది పడి, చిన్నా చితక పాత్రలతో బండిని నడిపించి తర్వాత్తర్వాత స్టార్ కమెడియన్ గా నిలదొక్కుకుని వరస అవకాశాలను సాధించాడు. ఒకానొక దశలో అసలు సునీల్ లేకుండా సినిమా తెరకెక్కేదే కాదు. సినిమాల్లో అంతటి ముఖ్యమైన పాత్రలు పోషించేవాడు. అతని కామెడీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అందరు కామెడియన్లలానే సునీల్ కూడా హీరో అవతారమెత్తాడు. హీరోగా అందాల రాముడు సినిమాతో మొదటి సక్సెస్ ను అందుకున్నాడు సునీల్. ఇక అక్కడి నుండి తన కెరీర్ డైలమా మొదలైంది. సునీల్ హీరోగా మొదటి ప్రయత్నం చేసినప్పుడు అటు హీరోగా ఇటు కమెడియన్ గా కూడా చేస్తానని అంటుండేవాడు. అయితే రాజమౌళి మర్యాద రామన్న చిత్రంతో సునీల్ కెరీర్ మొత్తం ఒక్కసారిగా టర్న్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సునీల్ లో పూర్తి స్థాయి హీరో అవ్వాలన్న ఆశ, కోరిక రెట్టింపైంది.  దాని తర్వాతే వచ్చిన పూల రంగడు సునీల్ లో కమెడియన్ ను పూర్తిగా చంపేసింది. అప్పటినుండి కేవలం హీరో పాత్రల మీదే సునీల్ దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. కమెడియన్ పాత్రలకు పూర్తిగా దూరమయ్యాడు.

దీంతో సునీల్ కామెడీను ఇష్టపడ్డ వాళ్లందరికీ నిరాశే ఎదురైంది. ఒకవైపు సునీల్ కూడా హీరోగా చేస్తూ వరస పరాజయాలు ఎదుర్కొన్నాడు. హీరోగా అవకాశాలు కూడా సన్నగిల్లడం మొదలైంది. మళ్ళీ కామెడీ పాత్రలవైపు చూసినా సునీల్ కు మునుపటి వెల్కమ్ లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించినా సునీల్ లో ఆ చార్మ్ పోవడంతో ప్రేక్షకుల నుండి ఆశించిన స్పందన రాలేదు. అరవింద సమేత లో త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చి హెల్ప్ చేసే ప్రయత్నం చేసాడు. అలాగే చిత్రలహరిలో కూడా సునీల్ ఒక క్యారెక్టర్ వేసాడు. ఇవేవీ సునీల్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్రేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రంలో సునీల్ ఒక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాములో రాముల సాంగ్ విడుదల చేసినప్పుడు అందులో సునీల్ కూడా కనపడ్డాడు. మరి ఈ పాత్రతో ఏమైనా మెప్పించగలడా అన్నది చూడాలి. మరోవైపు సునీల్ ను మళ్ళీ హీరోగా చేయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సునీల్ హీరోగా చేస్తే నిర్మించడానికి తాము సిద్ధమని ఇద్దరు నిర్మాతలు ముందుకు వచ్చినట్లు సమాచారం.

కమెడియన్ గానే కొనసాగి ఉంటే సునీల్ కెరీర్ ఇప్పటికి ఎలా ఉండేదో కానీ, మధ్యలో హీరో వేషాలెయ్యడం వల్ల ఎటూ కాకుండా పోయింది. మరిప్పుడు సునీల్ ఏం చేస్తాడు? సునీల్ అడుగులు ఎటువైపు అనేది చూడాలి.