విలన్ గా మారుతున్న సునీల్; విశేషాలివేSunil turns villain with colour photo
Sunil turns villain with colour photo

కమెడియన్ సునీల్ ప్రస్థానం గురించి మనం పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. కమెడియన్ గా చాలా తక్కువ కాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు సునీల్. దాదాపు ప్రతి సినిమాలో సునీల్ కంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉండేది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కేవలం సునీల్ తన కామెడీతో నిలబెట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి కమెడియన్ నుండి హీరో అవతారమెత్తాడు సునీల్. అందరు కామెడీ హీరోల్లా కాకుండా కేవలం హీరో పాత్రలపైనే దృష్టి పెట్టాడు. కమెడియన్ గా పూర్తిగా దూరమైపోయాడు. ముందు హీరోగా కొన్ని సక్సెస్ లు వచ్చినా క్రమంగా ప్లాపుల పరంపర మొదలైంది. ఒకటి తర్వాత ఒకటిగా ప్లాపులు మొదలయ్యే సరికి సునీల్ కు కోలుకోవడం చాలా కష్టమైపోయింది.

అయితే హీరోగా మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయిన నేపథ్యంలో సునీల్ మళ్ళీ కమెడియన్ గా స్థిరపడాలని చూసాడు, అవకాశాలు ఒకట్రెండు బానే వచ్చినా మునుపటి స్థాయిలో సునీల్ కు క్రేజ్ లేకపోవడం తన కెరీర్ ను దెబ్బ తీసింది. అందుకే కమెడియన్ గానే కాకుండా సీరియస్ రోల్స్ పై కూడా ఆసక్తి చూపించాడు. అరవింద సమేతలో సునీల్ పోషించిన పాత్ర అలాంటిదే. ఇన్నాళ్లు కమెడియన్, హీరోగా రాణించిన సునీల్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

సునీల్ ఈసారి విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించారు, మజిలీ, ప్రతిరోజూ పండగే సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో రాణించిన సుహాస్ హీరోగా మారుతూ చేస్తోన్న ‘కలర్ ఫోటో’ సినిమాలో సునీల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ లో అలరించిన బ్యాచ్ ప్రధానంగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు, సాంకేతిక నిపుణులుగా పనిచేస్తున్నారు. మసాలా సందీప్ గా పేరు గాంచిన సందీప్ రాజ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల నిర్మాత సాయి రాజేష్ నిర్మించనున్న ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్. కాల భైరవ సంగీత దర్శకుడు.

మరి విలన్ గా సునీల్ కొత్త ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.