స్టార్‌ డైరెక్ట‌ర్‌కి క్రేజీ ప్రొడ్యూస‌ర్ కండీష‌న్స్!


Suresh Babu Conditions to Asuran Director
Suresh Babu Conditions to Asuran Director

‘క‌లిసుందాంరా’… దాదాపు 19 ఏళ్ల క్రితం వ‌చ్చిన చిత్ర‌మిది. వెంక‌టేష్ హీరోగా దివంగ‌త మూవీమొగ‌ల్ డి. రామానాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో డిజ‌సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి అయిన బ‌డ్జెట్ అక్ష‌రాలా 3 కోట్ల 15 ల‌క్ష‌లు మాత్ర‌మే. ఇంత బ‌డ్జెట్‌లోనే సినిమాని పూర్తి చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం నిర్మాత సురేస్‌బాబు పెట్టిన కండీష‌న్స్‌. ఈ సినిమాను ఇన్ని రోజుల్లోనే పూర్తి చేయాలి. ఇంత బ‌డ్జెట్‌లోనే కంప్లీట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ఉద‌య‌శంక‌ర్‌కు కండీష‌న్‌లు పెట్టార‌ట‌. అందుకే ఎక్క‌డా అనుకున్న బ‌డ్జెట్ దాట‌లేద‌ని అదే కండీష‌న్స్‌ని ఇప్పుడు `అసుర‌న్‌` రీమేక్ కోసం సురేష్‌బాబు పెట్టిన‌ట్టు తెలిసింది.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం `అసుర‌న్‌`. ఈ చిత్రంలో హీరోగా న‌టించిన ధ‌నుష్ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో టూ వేరియేష‌న్స్‌ని చూపించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంక‌టేష్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ధ‌నుష్ పాత్రలో వెంక‌టేష్ న‌టించ‌నున్న ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. `బ్ర‌హ్మోత్స‌వం` డిజాస్ట‌ర్ త‌రువాత ఆయ‌న‌కు ద‌క్కిన అవ‌కాశ‌మిది. ద‌ర్శ‌కుడిగా ట్రాక్ రికార్డ్ సంతృప్తి క‌రంగా లేక‌పోవ‌డంతో కొన్ని కండీష‌న్‌లు పెట్టి అత‌నికి ఈ సినిమా ఇచ్చిన‌ట్టు తెలిసింది.

`అసుర‌న్‌` తెలుగు రీమేక్ కోసం డి. సురేష్‌బాబు కేటాయించిన బ‌డ్జెట్ 13 కోట్లు మాత్ర‌మే. ఇందులో చాలా మందికి రెమ్యున‌రేష‌న్ లేదు. వెంక‌టేష్‌తో పాటు ద‌ర్శ‌కుడిదీ ఇదే ప‌రిస్థితి. సినిమా బాగా ఆడితే అందులో వ‌చ్చే లాభాల్ని పంచుకోవాల‌ట‌. పైగా అనుకున్న బ‌డ్జెట్, వ‌ర్కింగ్ డేస్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ పెర‌గ‌రాద‌న్న‌ది ప్ర‌ధాన కండీష‌న్‌గా తెలిసింది. ఇన్నింటికి లోబ‌డి శ్రీ‌కాంత్ అడ్డాల `అసుర‌న్` రీమేక్‌ని తెర‌పైకి తీసుకురావాలి. సురేష్‌బాబు పెట్టిన కండీష‌న్స్‌ని క‌సిగా తీసుకుని సినిమాని కొత్త త‌ర‌హాలో తెర‌పైకి తీసుకొస్తాడా? లేదా అన్న‌ది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.