సుధీర్‌వర్మ‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం!


సుధీర్‌వర్మ‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం!
సుధీర్‌వర్మ‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం!

శ‌ర్వానంద్ హీరోగా తెర‌పైకొచ్చిన చిత్రం `ర‌ణ‌రంగం`. సుధీర్‌వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం గ‌త ఏడాది విడుద‌లై ప్రేక్ష‌కుల‌తో పాటు చిత్ర బృందాన్ని కూడా నిరాశ‌కు గురిచేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రం మేకింగ్ ప‌రంగా ప్ర‌శంస‌లు అందుకున్నా క‌థ ప‌రంగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ ఫ‌లితం తారుమారు కావ‌డంతో కొంత నిరుత్సాహానికి గుర‌య్యార‌ట‌.

అయితే తాజాగా ఆయ‌న‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ లభించిన‌ట్టు తెలిసింది. సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని నిర్మించ‌డానికి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల ఓ బేబీ, వెంకీ మామ వంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్న డి. సురేష్‌బాబు త్వ‌ర‌లో మ‌రో చిత్రాన్ని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. కొరియ‌న్ సినిమా ఆధారంగా `ఓ బేబీ` చిత్రాన్ని నిర్మించిన ఆయ‌న తాజాగా `మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్‌` అనే మ‌రో కొరియ‌న్ క‌థ‌నే తెలుగు తెర‌కు తీసుకొస్తున్నార‌ట‌.

కొరియ‌న్ చిత్రం ఇద్ద‌రు హీరోల నేప‌థ్యంలో సాగితే దాన్ని తెలుగుకే మాత్రం ఇద్ద‌రు హీరోయిన్‌ల నేప‌థ్యంలో సాగేలా మారుస్తున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే రెజీనా, నివేదా థామ‌స్‌ల‌ని ఎంపిక చేసుకున్నార‌ట‌. టెక్నిక‌ల్‌గా సినిమా హై స్టాండ‌ర్డ్స్‌లో వుండాల‌ని ప్లాన్ చేసిన సురేష్‌బాబు ఈ చిత్ర రీమేక్ కోసం ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మని ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధిక‌రిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంది.