చైతూ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయిన సురేష్


Suresh turns emotional about Naga Chaitanya
Suresh turns emotional about Naga Chaitanya

దగ్గుబాటి ఫ్యామిలీ అంతా నాగ చైతన్య విషయంలో చాలా ఎమోషనల్ గా ఉంటారు. తనను సపోర్ట్ చేయడం విషయంలో ఏనాడూ తగ్గరు. దగ్గుబాటి ఫ్యామిలీకి నాగ చైతన్యతో ఒక అదిరిపోయే సినిమా తీయాలన్న కల కూడా ఒకటి. రామానాయుడు బ్రతికున్న రోజుల్లోనే దానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మించాలని ఆయనకు ఉండేది. అయితే ఆయన కోరిక అప్పటికి తీరలేదు కానీ సురేష్ బాబు మాత్రం దాన్ని సాధించాడు. వెంకీ మామ సినిమాను నిర్మించి హిట్ కూడా కొట్టాడు. ఈ సినిమాకు యావరేజ్ రేటింగులే వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతోంది. వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరి కెరీర్స్ లో ఇదే బెస్ట్ కావడం విశేషం. ఆ రకంగా చూసుకుంటే సురేష్ బాబు కల పూర్తి విజయవంతమైనట్లే.

ఇక నాగ చైతన్య పట్ల అటు సురేష్ బాబు ఇటు వెంకటేష్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం, ఆమె వల్ల సోదరి లక్ష్మి కొడుకు కావడం ఒకటైతే, చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ పెరగడం మరో కారణం. చైతూ చిన్నప్పుడు ఈ ఇద్దరు మేనమామలు బాగా గారం పెట్టేవారట. పైగా అప్పట్లో చైతూ బొద్దుగా ఉండేవాడని, దగ్గుబాటి మానవళ్లలో క్యుటేస్ట్ బాయ్ చైతూనేనని ఇటీవలే సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇప్పుడు మరొక ఇంటర్వ్యూలో సురేష్ బాబు నాగ చైతన్య గురించి మరోమారు స్పందించాడు. తాను చైతూని బావ అని సంబోధిస్తానని తెలిపాడు సురేష్ బాబు. దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. మా సోదరి ఒక్కగానొక్క కొడుకు వాడు. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెంచుకున్నాం. వాడితో కలిసి గోళీలు ఆడుకున్న రోజులు కూడా నాకు గుర్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. చైతూ రానాను బావ అని పిలుస్తాడు. నేను వాడ్ని బావ అని పిలిచేవాడ్ని, ఈ మధ్య చైతూ అని పిలవడం నేర్చుకున్నా. వాళ్లిద్దరూ కలిసి పెరగడం వల్ల ఎంతో అనుబంధం ఉంది అని రివీల్ చేసాడు.

ఇక తన రెండో కొడుకు అభిరామ్ సినిమా ఎంట్రీ గురించి కూడా చెప్పాడు. తను ప్రస్తుతం ముంబైలో నటనకు సంబంధించిన శిక్షణ పొందుతున్నాడు. తనతో సినిమాలు తీయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఒకసారి అభిరాం తిరిగి వచ్చిన తర్వాత ఎందులో బెస్ట్ అన్న విషయాన్ని చూసుకుని దాని ప్రకారం సినిమా మొదలుపెడతాం అని చెప్పాడు.