ఎవ‌రెన్ని చెప్పినా సూర్య ఓటీటీకే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు!

Suryas soora rai potru to be releasing on amazon prime
Suryas soora rai potru to be releasing on amazon prime

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎవ‌రెన్ని విధాలుగా చెప్పినా హీరో సూర్య త‌న నిర్ణయానికే క‌ట్టుబ‌డి వున్నాడు. త‌ను నటించి నిర్మించిన `సూర‌రై పోట్రు` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికే రెడీ అయిపోయారు. త‌మిళ నాడు థియేట‌ర్స్ ఓన‌ర్స్ యూనియ‌న్ సూర్య త‌న చిత్రాల‌ని ఓటీటీలో రిలీజ్ చేస్తే భ‌విష్య‌త్తులో ఆయ‌న సొంత నిర్మాణ సంస్థ నిర్మించే చిత్రాల‌ని త‌మ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానివ్వ‌మ‌ని ఇటీవ‌ల ఆల్టిమేట‌మ్ జారీ చేసిన విష‌యం తెలిసిందే.

ఆ బెధిరింపుల‌కు లొంగ‌ని సూర్య త‌న చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. సూర్య తాజా నిర్ణ‌యంపై కొంత మంది విమ‌ర్శ‌లు చేస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం సూర్య‌కు అండ‌గా నిలుస్తున్నారు. తెలుగు నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ తాజాగా సూర్య‌కు త‌న మ‌ద్ద‌తును తెలుపుతూ ఓ లెట‌ర్‌ని మీడియాకు రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ డా. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా సుధా కొంగ‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో `వి` చిత్రం త‌రువాత అక్టోబ‌ర్ 30న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ చిత్రంపై అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది. దాదాపు 200 దేశాల్లో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతోంది.