సుశాంత్.. ఇకపై ఎలాంటి పాత్రలు చేస్తాడు?


Sushanth about his role in ala vaikunthapuramulo
Sushanth about his role in ala vaikunthapuramulo

అక్కినేని ఫ్యామిలీ బ్యాకింగ్ తో వచ్చిన మరో హీరో సుశాంత్. కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో, సక్సెస్ కోసం చాలానే వెయిట్ చేయాల్సొచ్చింది. ఎన్ని చేసినా విజయం మాత్రం దక్కలేదు. ఇప్పటివరకూ పదేళ్ల కెరీర్ లో సుశాంత్ చేసినవి కేవలం ఐదే సినిమాలు. అందులో కరెంట్ ఒక్కటే కొంచెం పర్వాలేదనిపించేలా ఆడింది. మిగిలిన సినిమాలు వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. దాదాపు అన్ని సినిమాలకు తన కుటుంబమే నిర్మాతలు కూడా అవ్వడంతో ఫైనాన్సియల్ గా కూడా కలిసొచ్చింది అంటూ ఏం లేదు. అయితే 2018లో చి ల సౌ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుశాంత్. ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తోన్న హిట్ మరో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి చేసిన ప్రయత్నంతో దక్కింది. ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న హిట్ రావడంతో సుశాంత్ తన నెక్స్ట్ సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని భావించాడు.

అందుకే నెక్స్ట్ సినిమా విషయంలో కొంచెం జాప్యం జరిగింది. ఈలోగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించే అవకాశం లభించింది. అల వైకుంఠపురములో చిత్రంలో ఒక కీలక పాత్ర చేసాడు సుశాంత్. సినిమా చిత్రీకరణ అప్పుడు ఏదో అనుకున్నారు కానీ ఈ సినిమాలో సుశాంత్ కు ప్రాధాన్యత బాగానే ఉన్నట్లుంది. టీజర్ లో కూడా ఈ హీరోకి ప్రాముఖ్యత బాగానే ఇచ్చారు. కథ ప్రకారం చూసుకున్నా కూడా సుశాంత్ పాత్ర చాలా ముఖ్యం. వినిపిస్తున్న కథనాల ప్రకారం అల్లు అర్జున్, సుశాంత్.. ఇద్దరూ కూడా తమ రోల్స్ ను మార్చుకుంటారని తెలుస్తోంది.

ఇక సోషల్ మీడియాలో సుశాంత్ కు ఒక అభిమాని నుండి వింత ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాలో మీది సెకండ్ హీరో రోల్ ఆ, లేక థర్డ్ హీరో రోల్ ఆ? అని ఆ సగటు వ్యక్తి కొంచెం వ్యంగ్యంగానే అడిగాడు. అయితే దానికి సుశాంత్ చాలా హుందాగా సమాధానమిచ్చాడు. ఈ సినిమాలో పాత్ర నచ్చి చేశాను కానీ, సెకండ్ ఆ , థర్డ్ ఆ అన్న లెక్కలు వేసుకోలేదని చెప్పాడు. ఇకపై హీరోగా కొనసాగుతూ, టాప్ హీరోల సినిమాల్లో ఇలాంటి పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.