సుశాంత్ కూడా ఓ బ్రాండ్‌ని ప‌ట్టేశాడుగా!


సుశాంత్ కూడా ఓ బ్రాండ్‌ని ప‌ట్టేశాడుగా!
సుశాంత్ కూడా ఓ బ్రాండ్‌ని ప‌ట్టేశాడుగా!

ఈ మ‌ధ్య స్టార్ హీరోలు, హీరోయిన్‌లు బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌గా మారిపోతున్నారు. త‌మ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఏదో ఒక పాపుల‌ర్ బ్రాండ్ కి ప్ర‌చార క‌ర్త‌లుగా మారిపోతున్నారు. నిత్యం క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ల‌లో న‌టిస్తూ త‌మ క్రేజ్‌ని ఆ బ్రాండ్‌ల‌కు ప్ల‌స్‌గా మారుస్తూ ఆ ఉత్ప‌త్తులకు పాపులారిటీని తెచ్చిపెడుతూ కార్పెరేట్ కంప‌నీలకు లాభాల వ‌ర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి అక్కినేని నాగార్జున మేన‌ల్లుడు, యంగ్ హీరో సుశాంత్ చేరిపోయారు. ఇటీవ‌ల `చి.ల.సౌ.` వంటి విభిన్న‌మైన సినిమాతో స‌క్సెస్‌ని సొంతం చేసుకున్న సుశాంత్ ఈ సంక్రాంతికి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో బ‌న్నీతో క‌లిసి న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. యంగ్ హీరోగా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న సుశాంత్ తాజాగా శీత‌పానియం స్ప్రైట్‌తో బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొత్త లీగ్‌లోని ఎంట‌ర‌య్యారు.

ఇది సుశాంత్ తొలి క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌. తెలుగులో ఇంత‌కు ముందు నాని ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా సుశాంత్ ప్ర‌చార క‌ర్త‌గా మార‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సుశాంత్ తొలి క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ని గురువారం విడుద‌ల చేశారు. త‌మిళంలో అనిరుధ్ ర‌విచంద‌ర్‌, హిందీలో ఆయుష్మాన్ ఖురానా ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుశాంత్ ప్ర‌స్తుతం `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` అనే వెరైటీ చిత్రంలో న‌టిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.