బన్నీ నుండి దీపావళి గిఫ్ట్ అదే! మరి మహేష్ నుండి?


బన్నీ నుండి దీపావళి గిఫ్ట్ అదే! మరి మహేష్ నుండి?
బన్నీ నుండి దీపావళి గిఫ్ట్ అదే! మరి మహేష్ నుండి?

ఎప్పుడూ లేనిది ఈసారి సంక్రాంతి సినిమాల గురించి చర్చ మూడు నెలల ముందుగానే మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రాలు సంక్రాంతికి ఒకేరోజు విడుదల కానుండడమే దీనికి కారణం. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం మామూలే కానీ ఒకేరోజు విడుదల చేయాలని డిసైడ్ చేయడం, ఎవరూ వెనక్కి తగ్గడానికి ఇష్టపడకపోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చివరి వరకూ ఇలానే ఉంటారా లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గి రెండు సినిమాలకి మేలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం ట్రేడ్ కు మంచిది కాదు.

సరే ఆ విషయం పక్కనపెడితే ప్రమోషన్స్ లో కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. అల వైకుంఠపురములో నుండి ఒక పోస్టర్ వచ్చిందంటే కొన్ని గంటల్లోనే సరిలేరు నీకెవ్వరు నుండి ఏదొక అప్డేట్ వస్తోంది. మహేష్ పుట్టినరోజుకి సరిలేరు నీకెవ్వరు అంటూ ఒక చిన్న సాంగ్ బిట్ వదిలితే ఇంకా చాలా నెలల సమయమున్నా కానీ అల వైకుంఠపురములో మేకర్స్ “సామజవరగమనా” అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇలా రెండు సినిమాలూ ప్రమోషన్స్ విషయంలో కూడా పోటీ పడుతుండడం అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నింపింది. దీపావళి వస్తుండడంతో అల వైకుంఠపురములో టీమ్ గిఫ్ట్ గా ఈ చిత్రంలో నుండి రెండో సింగిల్ “రాములో రాముల” వీడియో టీజర్ ను ఈరోజు విడుదల చేయనున్నారు. అయితే ఈ సాంగ్ టీజర్ నిడివి ఎంత అన్నది తెలియలేదు. ఈ అప్డేట్ రాగానే సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా దీపావళికి మహేష్ అభిమానులకు ఒక గిఫ్ట్ ఉంటుందని ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఆ గిఫ్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ టీమ్ నుండి కూడా ఏదైనా సాంగ్ టీజర్ ను విడుదల చేస్తారా లేక ఫస్ట్ సింగిల్ ను వదులుతారా లేక మహేష్, విజయశాంతి ఉన్న పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తారా ఏకంగా మూవీ టీజర్ నే ఊహించవచ్చా అన్నది తెలియలేదు. ఏదేమైనా వాళ్ళు వీడియో సాంగ్ టీజర్ వదులుతున్నారు కాబట్టి దానికి తగ్గకుండా ఉండేలా చూడాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో కనిపించబోతోంది. ఈ పాట కూడా అభిమానులను అలరించేదిగా ఉంటుందని అంటున్నారు. 1970ల కాలం నాటి రెట్రో సెటప్ తో ఈ పాటను వచ్చే నెలలో షూట్ చేయబోతున్నారట. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల్లో పైచేయి ఎవరిదో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడక తప్పదు.