సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూSye Raa Narasimha Reddy Movie Review in Telugu
Sye Raa Narasimha Reddy Movie Review in Telugu

సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ:
నటీనటులు :
చిరంజీవి, నయనతార, తమన్నా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్ తదితరులు
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత‌లు : రామ్ చరణ్
సంగీతం : అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫర్ : రత్నవేల్
విడుదల తేదీ: 2 అక్టోబర్ 2019
రేటింగ్ : 3.5/5

దాదాపు 12 ఏళ్ల నుండి మెగాస్టార్ చిరంజీవి కల స్వతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరకెక్కించాలని. అయితే ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్ ద్వారా తన కలను తీర్చుకున్నాడు. సైరా నరసింహారెడ్డి పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 5 భాషల్లో విడుదలైంది. మరి ఈ భారీ పీరియాడిక్ డ్రామా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
సైరా నరసింహారెడ్డి రాయలసీమలో పాలెగార్ల వ్యవస్థను ప్రస్తావిస్తుంది. బ్రిటీషు వారిపై 1847లో ఎదురుతిరిగిన మజ్జరి నరసింహారెడ్డి రాయలసీమలోని 61 స్వతంత్ర పాలెగార్లలో ఒకరు. బ్రిటీషు వారికి శిస్తు కట్టి ఆ ప్రాంతాన్ని చూసుకుంటుంటారు. అయితే ఆ ప్రాంతంలో కరువు రావడంతో పరిస్థితి మారుతుంది. ఆ సమయంలో కూడా బ్రిటీషు వారు శిస్తు కట్టమనడంతో బ్రిటీషు వారితో సైరాకి పోరాటం మొదలవుతుంది. ఒక్కడిగా మొదలైన ఈ ఉద్యమం ఇతర పాలెగార్ల చేరికతో స్వతంత్ర పోరాటంగా ఎలా మారిందన్నది మిగతా కథ.

కథనం :
సైరా నరసింహారెడ్డి మొదలుకావడం చాలా స్లోగా ఉంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తన సైనికులలో స్ఫూర్తి నింపడానికి పదేళ్ల క్రితం జరిగిన స్ఫూర్తిమంతుడి కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. ఒక్కొక్క పాత్ర పరిచయం, అప్పటి పరిస్థితులను ప్రేక్షకులకు వివరంగా చూపించాలని ప్రయత్నించడంతో మొదటి గంట సినిమా నత్తనడకన సాగుతుంది. అయితే మొదటిసారి నరసింహారెడ్డి ఆఫీసర్ జాక్సన్ పై ఎదురుతిరిగి, ట్రైలర్ లో చూపించిన “ఎందుకు కట్టాలిరా శిస్తు” డైలాగ్ తో ఒక్కసారిగా సినిమాలో ఊపువస్తుంది. అక్కడి నుండి ఇంటర్వెల్ దాకా సైరా ఓ రేంజ్ లో సాగుతుంది. ప్రేక్షకులకు ఈ సమయంలో రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.

సెకండ్ హాఫ్ కూడా సినిమాటిక్ సీన్లతో సాగుతూ మనం చూసేది పీరియాడిక్ డ్రామానా ఫక్తు కమర్షియల్ మాస్ చిత్రమా అన్న సందేహం ప్రేక్షకులలో కలగడం ఖాయం. బ్రిటీషు వారికీ, పాలెగార్లకు మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలతో సినిమా రేసిగా సాగుతుంది. అయితే మాస్ ప్రేక్షకులను సంతృప్తి పరచడం కోసం సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ తీసేసుకున్నారా అనిపిస్తుంది.

ఎందుకంటే మూడు, నాలుగు తాలూకాలు తమ అధీనంలో ఉండే పాలెగార్లకి, బ్రిటీషు వారికీ మధ్య గొడవను ఒక భారీ యుద్ధం తరహాలో, ఏదో ఒక మహా సామ్రాజ్యానికి, బ్రిటీషు వారికి మధ్య సంగ్రామంగా చిత్రీకరించారు. చరిత్రలో ఎక్కడా నరసింహారెడ్డి అండ్ కో 10,000 మంది బ్రిటీషు వారిని చంపినట్లు లేదు. మరోవైపు బ్రిటీషు వారు నరసింహారెడ్డిని పట్టుకునే సమయానికి ముందే ఆయన భార్య సిద్ధమ్మ చనిపోయింది. కానీ ఇక్కడ బ్రతికినట్లు చూపించారు. ఇలా చరిత్రను మారుస్తూ ఒక మాస్ చిత్రానికి కావాల్సిన సరంజామాను సిద్ధం చేసుకున్నారు సైరా టీమ్.

ఫైనల్ గా వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళుతుంది.

నటీనటులు :
మెగాస్టార్ చిరంజీవి కన్న కల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరకెక్కించడం. అయితే 60 ఏళ్లకు పైబడ్డ చిరంజీవి ఎంత కష్టపడినా, ఎంత తన నటనతో మైమరపించినా తన వయసు కనిపిస్తూనే ఉంది. ఏదేమైనా చిరంజీవి కమిట్మెంట్ ను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఈ వయసులో కూడా ఆయన కష్టపడిన తీరు తెరపై కనువిందు చేస్తుంది. నయనతార, చిరంజీవి భార్యగా సిద్ధమ్మ పాత్రలో హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తమన్నా కూడా మెప్పిస్తుంది. ఇక ఒక్కో భాష నుండి ఎంపిక చేసుకున్న లెజండ్స్ అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు.. ఇలా ఎవరికి వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతావారంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం :
సైరా నరసింహారెడ్డి సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన చిత్రం. చరిత్రను తమ వీలుకు తగ్గట్లు మార్చేసినా ప్రేక్షకులకు నచ్చే విధంగా కథను మార్చారు. డైలాగ్స్ పరిస్థితులకు తగ్గట్లు ఉండి ఆకట్టుకుంటాయి. సంగీతం సో, సో గా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అయితే సూపర్ అనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవచ్చనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతం. తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం చరణ్ ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కించాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి తన బాధ్యతను పూర్తి కన్విక్షన్ తో నెరవేర్చాడు.

చివరిగా :
ఒక స్ఫూర్తిమంతుడైన స్వతంత్ర పోరాట యోధుని కథను మన ప్రేక్షకులకు నచ్చే విధంగా మలచడంలో సైరా టీమ్ సక్సెస్ అయింది. అయితే చరిత్రను మరీ ఎక్కువగా మార్చేసారా అనిపిస్తుంది. ఏదేమైనా సైరా మొదలుకావడం కొంచెం స్లోగా ఉన్నా, కొంచెం పేస్ అందుకున్నాక ఇక ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయింది. ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకు పెర్ఫెక్ట్ ముగింపునిచ్చింది. మొత్తంగా సైరా ఈ దసరాకు తప్పక చూడాల్సిన చిత్రం.

సై సైరా..