రిలీజ్ కు ముందు ప్రభాస్.. రిలీజ్ తర్వాత చిరు


syeraa and saaho promotions trend
syeraa and saaho promotions trend

ఏ చిత్రానికైనా, అందులో పెద్ద హీరోలు, దర్శకులు ఎవరున్నా సరే ప్రమోషన్స్ అనేది అత్యంత కీలకం. అందుకే రాజమౌళి లాంటి వ్యక్తి సైతం రిలీజ్ కు నెల రోజుల ముందు నుండీ ప్రమోషన్స్ కోసమే టైమ్ కేటాయిస్తాడు. ఈ విషయంలో ప్రభాస్ ను కూడా మెచ్చుకోవాలి. సాహోలో నటించడానికి ఎంత కష్టపడ్డాడో కానీ ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడ్డాడు ప్రభాస్.

హిందీలో ఈ చిత్రాన్ని నిలబెట్టడం కోసం రాత్రీపగలూ అన్న తేడా లేకుండా పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడి ఫేమస్ టీవీ కార్యక్రమాలకు సైతం హాజరయ్యాడు. ఇది నార్త్ ఇండియాలో సాహోకి బాగా కలిసొచ్చింది. ప్లాప్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఫైనల్ గా నార్త్ ఇండియాలో ఈ సినిమా హిట్టైంది.

ఇప్పుడు చిరంజీవి విషయానికి వస్తే సైరా చిత్రాన్ని పాన్ ఇండియాగానే విడుదల చేసారు. అయితే ప్రమోషన్స్ విషయంలో కావాలని లో ప్రొఫైల్ మైంటైన్ చేద్దామనుకున్నారో లేక అలసత్వం ప్రదర్శించారో తెలీదు కానీ సైరాకు హిందీలో ప్రమోషన్లు దాదాపు సూన్యం. అయితే విడుదలైన తర్వాత చిత్రానికి మంచి టాక్ వచ్చింది. చిరంజీవి విడుదల తర్వాత ప్రమోషన్ల విషయంలో ఆకట్టుకున్నాడు. టివిలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, త్రివిక్రమ్ చేత ఇంటర్వ్యూ చేయించుకోవడం, థ్యాంక్స్ మీట్ నిర్వహించడం, తెలంగాణ గవర్నర్ ను కలవడం, త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి సినిమా చూడమని విన్నవించడం వంటి కార్యక్రమాలతో రోజూ ఏదో విధంగా సైరాను వార్తల్లో ఉంచుతున్నాడు.

దీనివల్ల పదో రోజు కూడా సైరా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగున్నాయి. వర్కింగ్ డేస్ అయినా కానీ సైరా ఎక్కడా తగ్గట్లేదు. ఈ రకంగా ప్రభాస్ సినిమా రిలీజ్ కు ముందు నార్త్ ఇండియాలో ప్రమోట్ చేసి హిట్ కొడితే, చిరు రిలీజ్ తర్వాత ప్రమోషన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో హిట్ కొట్టాడు. అదీ సంగతి.