పలాస చూడకపోతే మీ ఖర్మ అంటున్న తమ్మారెడ్డి


పలాస చూడకపోతే మీ ఖర్మ అంటున్న తమ్మారెడ్డి
పలాస చూడకపోతే మీ ఖర్మ అంటున్న తమ్మారెడ్డి

ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సినిమాలు ఆడుతున్నవి ఎక్కువే ఉన్నా దేనికీ కలెక్షన్స్ రాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఫిబ్రవరి నుండి మార్చ్ వరకూ టాలీవుడ్ అన్ సీజన్ గా చెప్పుకుంటారు. ఈ సీజన్ లో విడుదలైన సినిమాలు కలెక్షన్స్ రాబట్టినవి చాలా తక్కువ. అందుకే పెద్ద సినిమాలు అయితే సంక్రాంతికి లేదా తర్వాత వచ్చే సమ్మర్ కు విడుదలలు షెడ్యూల్ చేసుకుంటాయి. పుండు మీద కారం అన్నట్లుగా అసలే దిక్కుతోచని స్థితిలో ఉన్న థియేటర్లకు ఇప్పుడు కరోనా భయం ఒకటి పట్టుకుంది. దాంతో థియేటర్లకు రావడానికే ప్రేక్షకులు భయపడే పరిస్థితి నెలకొంది.

వచ్చే ఒకటీ అరా ప్రేక్షకుడు కూడా థియేటర్ కు రావట్లేదు. ఈ నేపథ్యంలో మంచి సినిమా తీసి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని బాధపడ్డాడు సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అప్పటి ఊరి సంస్కృతిని, నేపధ్యాన్ని సినిమాలో చక్కగా చూపించామని, మంచి సినిమా తీసినా కూడా థియేటర్లకు జనాలు రాకపోతే ఇక ఏమంటామని అన్నాడు. ఇటీవలే విడుదలైన పలాస 1978 చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించాడు తమ్మారెడ్డి. ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. ఐతే మొదటి రోజు ఈ చిత్రానికి 20 శాతం ఆక్యుపెన్సీ ఉండడం దారుణం. శనివారం కూడా వసూళ్లు ఇలానే ఉన్నాయి. కష్టపడి సినిమా తీసి, టాక్ కూడా బాగా వచ్చాక సినిమాకు కలెక్షన్స్ లేకపోతె నిర్మాతకు అసహనం రాకుండా ఎలా ఉంటుంది.

అయితే తన అసహనాన్ని స్టేజ్ పై నుండే ప్రేక్షకుల మీద వ్యక్తం చేసాడు. ఇలాంటి సినిమా చూడాల్సిన బాధ్యత మీకు లేదా.. మంచి సినిమా తీసాం కదా. ఇలాంటి సినిమా చూడకపోతే ఇక మీ ఖర్మ అని వ్యాఖ్యానించాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ రియలిస్టిక్ పీరియాడిక్ డ్రామాలో రక్షిత్ హీరోగా నటించాడు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా విలన్ గా నటించి మెప్పించడం విశేషం.