త‌మ‌న్నా కూడా తెలంగాణం అంటోంది!త‌మ‌న్నా కూడా తెలంగాణం అంటోంది!
త‌మ‌న్నా కూడా తెలంగాణం అంటోంది!

తెలంగాణ యాస అప్పుడూ.. ఇప్పుడూ టాలీవుడ్‌లో హిట్టే. గ‌త కొన్నేళ్ల క్రితం `మొండి మొగడు పెంకి పెళ్లాం`చిత్రం కోసం తొలిసారి విజ‌య‌శాంతి తెలంగాణ యాస‌లో అమ్ములుగా న‌టించి ఆక‌ట్టుకుంది. సుమ‌న్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఆ త‌రువాత చాలా ఏళ్ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ `అర్జున్‌రెడ్డి`తో మ‌ళ్లీ మ్యాజిక్ చేశాడు.

త‌మిళ కుట్టి సాయి ప‌ల్ల‌వి `ఫిదా` చిత్రంలో తెలంగాణ యువ‌తిగా న‌టించి భానుమ‌తిగా మాయ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరో వ‌రుణ్‌తేజ్ అయినా మేజ‌ర్ క్రెడిట్‌ని మాత్రం సాయిప‌ల్ల‌వే ద‌క్కించుకుంది. త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న `విరాట‌ప‌ర్వం`లోనూ, శేఖ‌ర్ క‌మ్ముల తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`లోనూ సాయి ప‌ల్ల‌వి తెలంగాణ యువ‌తిగా మ‌రోసారి మ్యాజిక్ చేయ‌బోతోంది. ఇదిలా వుంటే మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా తొలిసారి తెలంగాణ యువ‌తిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతోంది.

త‌మ‌న్నా న‌టిస్తున్న తాజా చిత్రం `సీటీమార్‌`. గోపీచంద్ హీరోగా సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా మ‌హిళా హాకీ టీమ్‌కి కోచ్‌గా క‌నిపించ‌బోతోంది. సినిమాలో ఆమె పేరు జ్వాలారెడ్డి, ప‌క్కా తెలంగాణ హైద‌రాబాద్ యువ‌తిగా త‌మ‌న్నా పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగుతుందని చిత్ర బృందం ద్వారా తెలిసింది. తెలంగాణ యాస‌లో కొత్త పంథాలో సాగ‌నున్న త‌మ‌న్నా పాత్ర సినిమాకు ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని తెలిసింది.