అన్ని అవకాశాలు థమన్ లాగేసుకుంటున్నాడా? అన్ని అవకాశాలు థమన్ లాగేసుకుంటున్నాడా?
అన్ని అవకాశాలు థమన్ లాగేసుకుంటున్నాడా?

సంగీత దర్శకుడు థమన్ ఊపు మాములుగా లేదిప్పుడు. వరసగా క్రేజీ ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ తర్వాత సెకండ్ ప్రిఫెరెన్స్ గా ఉండేవాడు థమన్. అంటే దేవికి మొదట అన్ని అవకాశాలూ వెళ్ళేవి. తను బిజీగా ఉంటే అప్పుడు థమన్ ను కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. నెల గ్యాప్ లో థమన్ స్వరపరిచిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

మొదటగా సందడి వెంకీ మామ సినిమాతో మొదలవుతుంది. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన వెంకీ మామ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది. ఇక వారం రోజుల తర్వాత అంటే డిసెంబర్ 20న సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి రోజూ పండగే చిత్రానికి కూడా థమన్ సంగీత సారధ్యం వహించడం విశేషం. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ కు మ్యూజిక్ డైరెక్టర్ కు థమనే. ఇంతటితో అయిపోలేదు. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో కి సంగీతం అందిస్తోంది థమన్ కావడం విశేషం. ఈ సినిమాలో ఇప్పటివరకూ విడుదలైన మూడు పాటలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో చూస్తూనే ఉన్నాం. ఇక జనవరి 24న విడుదలకు షెడ్యూల్ అయిన డిస్కో రాజా చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతెందుకు, రవితేజ తర్వాతి సినిమా క్రాక్ కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ థమనే.

ప్రస్తుత థమన్ ఫామ్ చూసి దర్శక నిర్మాతలు అందరూ అటే క్యూ కడుతున్నారు. థమన్ కే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. చాలా తక్కువ టైమ్ లోనూ బెటర్ ఔట్పుట్ ఇవ్వడం. పారితోషికం విషయంలో కూడా రీజనబుల్ గా ఉండడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టడం, ప్రస్తుతం ఫామ్ ఈ కారణాలన్నిటి వలన థమన్ కే అగ్ర తాంబూలం దక్కుతుంది. దీనివలన దేవిని తమ ఆస్థాన సంగీత దర్శకుడిగా పెట్టుకున్న వాళ్ళు సైతం ఇప్పుడు థమన్ వైపు చూస్తుండడం విశేషం.

బోయపాటి – బాలకృష్ణ సినిమాకి నిన్న ముహూర్తం జరిగింది. ఈ సినిమాకు సాధారణంగా అయితే దేవినే సంగీతం అందించాలి. కానీ ఈసారి థమన్ తో వెళదామా అని బోయపాటి అనుకుంటున్నాడట. సరైనోడు తర్వాత థమన్ తో పనిచేయలేదు బోయపాటి. పైగా వినయ విధేయ రామకు నెగటివ్ రెస్పాన్స్ రావడంతో దేవి నుండి బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాడట. మహేష్ బాబు – వంశీ పైడిపల్లి సినిమాకు కూడా థమన్ ను తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఆగడు సినిమా తర్వాత థమన్ – మహేష్ కాంబో ఆగిపోయింది. సో మళ్ళీ ఈ జోడి సంగీత ప్రియుల్ని అలరించబోతోందన్నమాట. మహర్షి సినిమాకు వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ కు వంశీ పైడిపల్లి కూడా దేవి నుండి బ్రేక్ తీసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాడట. ఇలా దేవి అవకాశాలన్నీ థమన్ తన్నుకుపోతున్నాడు.