థమన్ విషయంలో మార్పుకు కారణమేంటి?


థమన్ విషయంలో మార్పుకు కారణమేంటి?
థమన్ విషయంలో మార్పుకు కారణమేంటి?

సంగీత దర్శకుడిగా థమన్ కెరీర్ ను రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి మహానుభావుడు, తొలిప్రేమ సినిమాలకు ముందు, వాటి తర్వాత. కెరీర్ మొదట్లో అలరించే ఆల్బమ్స్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనతికాలంలో ఎదిగిన థమన్ తర్వాత రొటీన్ సంగీతంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. మెలోడీస్ తగ్గించేసి అవే డప్పులతో మ్యూజిక్ క్వాలిటీని తగ్గించేసాడు. దీంతో థమన్ పై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే గత రెండు, మూడు ఏళ్ల నుండి పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. థమన్ సంగీతం క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయింది. మెలోడీలే తనని నిలబెడతాయని అర్ధం చేసుకున్నాడు. గత కొంత కాలంలో థమన్ అందించిన మెలోడీల శాతం తన కెరీర్ మొత్తంలో కొట్టిన దానికన్నా ఎక్కువ ఉందంటే తనలో ఎంత మార్పు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. గత కొనేళ్ల నుండి థమన్ తన ప్రతి ఆల్బమ్ లో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇదివరకు డప్పు మ్యూజిక్ కు దర్శకులు, నిర్మాతలను బ్లేమ్ చేసే థమన్ ఇప్పుడు పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. ఇంతలో థమన్ ను ఈ రకమైన ఛేంజ్ రావడానికి కారణమేంటి అని అందరూ అనుకున్నారు.

దీనికి సమాధానం ఇటీవలే ఒక మీడియా మీట్ లో చెప్పుకొచ్చాడు థమన్. సరైనోడు మ్యూజికల్ గా హిట్ అయినా తాను చేసే సినిమాల విషయంలో ఒకసారి సమీక్షించుకోవాలని సినిమాలను బాగా తగ్గించేసాడట. ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలి, దానికి ఎలాంటి సంగీతం అందించాలి అని బాగా సమీక్షించుకుంటున్న తరుణంలో తన వద్దకు మహానుభావుడు, తొలిప్రేమ సినిమాలు వచ్చాయని, లక్కీగా వీటికి భిన్నమైన మ్యూజిక్ ను అందించడానికి స్కోప్ దొరికిందని, ఈ రెండు ఆల్బమ్స్ బాగా హిట్ అవ్వడంతో తన నుండి ఎలాంటి సంగీతం కోరుకుంటున్నారు అన్న విషయంలో క్లారిటీ వచ్చినట్లైంది అని చెప్పుకొచ్చాడు థమన్.

ఈ ఏడాది థమన్ పూర్తి ఫామ్ లో ఉన్నాడు. అల వైకుంఠపురములో సినిమాకు అదిరిపోయే సంగీతం అందించాడని అర్ధమైపోతుంది. మొదటి రెండు పాటలు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో చూస్తూనే ఉన్నాం. మొదటి 100 మిలియన్ వ్యూస్ సాధించగా, రెండో పాట 80 మిలియన్ వ్యూస్ కు చేరువైంది. అల వైకుంఠపురములో తో పాటు వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, డిస్కో రాజా సినిమాలకు కూడా థమన్ సంగీతం అందిస్తుండడం విశేషం. మరి ఈ సినిమాలు విడుదలయ్యాక థమన్ రేంజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.