థమన్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్


thaman to score music for pawan kalyans pink remake
thaman to score music for pawan kalyans pink remake

ఈ మధ్య థమన్ టైమ్ ఏంటో తనకు కూడా అర్ధం కావట్లేదు. ప్రతీ క్రేజీ ప్రాజెక్ట్ తన ఖాతాలోనే పడిపోతోంది. గతేడాది నుండి బాణీలు కట్టడంలో స్టైల్ ను పూర్తిగా మార్చేసిన థమన్ దానికి తగ్గ ఫలాలను అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్టులన్నిటికీ (ఒకటి రెండు తప్ప) థమన్ సంగీత దర్శకుడు కావడం విశేషం. గత రెండు నెలల నుండి యూట్యూబ్ లో ఏ పాట విడుదలవుతున్నా దానికి సంగీత దర్సకుడు ఎవరా అని చూడాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి థమన్ పేరే ఉంటోంది. మొదట అల వైకుంఠపురములో చిత్రంలో సామజవరగమన పాటతో అంతా మొదలైంది. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సాంగ్. ఇప్పటికి ఈ సాంగ్ 92 మిలియన్ వ్యూస్ సాధించింది, 1మిలియన్ లైక్స్ వైపు దూసుకుపోతోంది. అలాగే అదే సినిమాలో రాములో రాముల కూడా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సాంగ్ 60 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. అంతే కాకుండా వెంకీ మామ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండూ కూడా వేటికవే ప్రత్యేకంగా ఉండడం కాకుండా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోంచి కూడా రెండు పాటలు విడుదలయ్యాయి. టైటిల్ సాంగ్, ఓ బావ సాంగ్స్ రెండూ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రొడక్షన్ లో ఉన్న డిస్కో రాజా సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోంచి కూడా ఒక సాంగ్ విడుదలై సూపర్ హిట్ అయింది.

ఇక్కడితో లిస్ట్ అయిపోలేదు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్ ఇండియాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో చేయబోతున్న సినిమాకు కూడా థమన్ సంగీత దర్శకుడు. సాయి ధరమ్ తేజ్ ఇటీవలే మొదలుపెట్టిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు థమన్ పనిచేస్తున్నాడు. రవితేజ ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసిన క్రాక్ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా తెలుగులో వరసగా క్రేజీ ప్రాజెక్టులకు థమన్ పనిచేస్తున్నాడు. డిసెంబర్ నుండి ప్రతి నెలలో కనీసం ఒక్క సినిమా అయినా థమన్ ది విడుదలవుతుంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇవి చాలవన్నట్లు థమన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ  ఇవ్వనున్న సంగతి తెల్సిందే. పవన్ కళ్యాణ్ నటించనున్న పింక్ సినిమా రీమేక్ కు ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలైపోయాయి. జనవరి నుండి షూటింగ్ కు వెళ్లనున్న నేపథ్యంలో దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ కలిసి సాంకేతిక వర్గాన్ని ఎంచుకునే పనిలో పడ్డారు. సంగీత దర్శకుడిగా థమన్ పేరుని ప్రదిపాదించారట. ఇప్పటికే థమన్ తో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ కూడా థమన్ పేరునే రికమెండ్ చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.