త‌రుణ్‌భాస్క‌ర్ కొత్త అడుగులు!


Tharun Bhascker planing web series with laxmi manchu
Tharun Bhascker planing web series with laxmi manchu

పెళ్లిచూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు య‌వ ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్‌. ఆ త‌రువాత `ఫ‌ల‌క్‌నుమాదాస్‌`లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, `మీకు మాత్ర‌మే చెప్తా` చిత్రంతో హీరోగా ఆక‌ట్టుకున్నారు. అయితే ఈ సినిమా త‌రువాత త‌రుణ్ భాస్క‌ర్ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడా అని అంతా ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. అయితే ద‌ర్శ‌కుడిగా రెండు చిత్రాలు, న‌టుడిగా నాలుగు చిత్రాల్లో మెరిసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న త‌రుణ్‌భాస్క‌ర్ ఈ సారి వెబ్ సిరీస్ బాట‌ప‌డుతున్నారు.

డిజిట‌ల్ రంగం విస్తృతం అవుతున్న నేప‌థ్యంలో త‌రుణ్‌భాస్క‌ర్ వెబ్ ప్ర‌పంచంలోకి అడుగుపెడుతుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. త్వ‌ర‌లోనే త‌రుణ్ ఓ వెబ్ సిరీస్‌ని ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఇందులోని ఓ కీల‌క పాత్ర‌లో మంచు ల‌క్ష్మి న‌టించ‌నున్న‌ట్టు తాజా స‌మాచారం. సినిమాల్లో న‌టించ‌డం త‌గ్గించుకున్న మంచు ల‌క్ష్మి వెబ్ సిరీస్‌ల‌తో పాటు బుల్లితెర‌పై రియాలిటీ షోలు చేస్తున్నారు. ఇటీవ‌ల `మిసెస్ సుబ్బ‌ల‌క్ష్మి` అనే వెబ్ సిరీస్‌లో న‌టించిన ఆమె త‌రుణ్‌భాస్క‌ర్ తెర‌పైకి తీసుకురాబోతున్న వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది.

`సైన్మా` అనే షార్ట్ ఫిల్మ్‌తో త‌రుణ్‌భాస్క‌ర్ పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన త‌రువాతే త‌రుణ్‌తో ఓ సినిమా చేయాల‌ని మంచు ల‌క్ష్మి ప్లాన్ చేశార‌ట‌. కానీ అది కొన్ని కార‌ణాల వ‌ల్ల కార్య‌రూపం దాల్చ‌లేద‌ని, ఇద్ద‌రు క‌లిసి వ‌ర్క్ చేయాల‌న్న‌ది ఇప్ప‌టికి కుదిరింద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. త‌రుణ్‌భాస్కర్ ప్రారంభించ‌బోతున్న వెబ్ సిరీస్ ఏంటి? ఎప్పుడు మొద‌ల‌వుతుంది వంటి వివ‌రాలు ఇంకా తెలియాల్సి వుంది.